calender_icon.png 4 August, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంఖం అంటే ప్రణవం! చక్రం అంటే సుదర్శనం!!

29-12-2024 12:00:00 AM

ఉజ్ఞళ్= మీ, పురైక్కడై త్తోట్టత్తు= పెరటి తోటలో, వావియుళ్= కొలనులో, శెజ్ఞరునీర్ వాయ్ నెగిర్ అంద్= ఎర్రతామరలు వికసించి, ఆమ్బల్ వాయ్ కుమ్బిన= నల్లకలువలు ముకుళించుకుని ఉన్నాయి, కాణ్= చూడు, శెజ్ఞల్పొడి క్కూరై= కాషాయవస్త్రాలు ధరించిన వారు, వెణ్బల్= తెల్లని పలువరస గల వారు, తవత్తవర్= తపసులు, తజ్ఞళ్ తిరుక్కోయిల్= తమ దైవసన్నిధిలో, శంగిడువాన్= శంఖం మోగించడానికి, పోగిన్ఱార్= వెళ్తున్నారు, ఎజ్ఞళై= మమ్మల్ని, మున్నం ఎరుప్పువాన్= ముందుగానే వచ్చి లేపుతానని, వాయ్ పేశుమ్= నోటితో చెప్పిన, నజ్ఞాయ్!= ఓ పరిపూర్ణురాలా, ఎరుందిరాయ్= లేచి రమ్ము, నాణాదాయ్!= సిగ్గు లేని దానా, నావుడైయాయ్= తీయని మాటలు గుప్పించే నాలుక గలదానా, శజ్ఞొడు చక్కరం= శంఖచక్రాలను, ఏందుం= ధరించిన, తడక్కైయం= దీర్ఘబాహువులు గలవాడునూ, పజ్ఞయ క్కణ్ణానై= ఎర్ర తామర లను పోలిన కన్నులు గలవాడు అయిన సర్వేశ్వరుని, ప్పాడ= స్తుతించడం.

చెలికత్తెలమైన మమ్ములని ముందుగానే లేపుతానని మీ నోటితోనే చెప్పిన పరిపూర్ణురాలా, సిగ్గులేని దానా, తీయని మాటలు చెప్పే నాలిక గలదానా, మీ ఇంటిపెరటిలోని తోటలో బావిలోన ఎర్ర తామరలు విరిసినవి. నల్ల కలువలు ముకుళించినవి. ఎర్రని జేగురు రాళ్లపొడితో రంగు అద్దిన కాషాయ వస్త్రాలను దాల్చి, తెల్లి పలువరుసలు గల సన్యాసులు తమ దేవాలయాలకు కుంచెకోల పట్టుకుని ఆరాధనకై వెళ్తున్నారు. మా కొరత తీర్చుము. లెమ్ము. శంఖచక్రాలను ధరించిన విశాల బాహువక్షం కలిగిన పుండరీకాక్షుని కీర్తించుటకు రమ్ము.

శంఖం అంటే ప్రణవం, చక్రమంటే సుదర్శనం, భగవంతుడిని చక్కగా చూపేది. కుంచెకోల అంటే ఆచార్య జ్ఞానముద్ర. జ్ఞానముద్ర అంటే చూపుడు వేలు బొటనవేలుతో చేర్చి, మూడువేళ్లు దూరంగా ఉంచడం. బొటన వేలు భగవంతుడు. చూపుడు వేలు అంటే జీవుడు. మూడు వేళ్లు అంటే గుణత్రయం. మూడు గుణాలు దూరమైతేనే జీవుడు భగవంతుడు చేరుననడమే జ్ఞానముద్రలోని సందేశం. శంఖచక్రాలను భుజాల పైన దాల్చిన ఆచార్యులే మనకు ఆశ్రయించదగిన వారు అని కందాడై రామానుజాచార్య వివరించారు.

శంఖ చక్రధరుడైన శ్రీ కృష్ణుడిని గోపికలు కీర్తిస్తున్నారు. పుట్టే యపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు, ఎట్టు ధరియించెనే ఈ కృష్ణుడూ అని అన్నమయ్య వర్ణిస్తాడు. శ్రీకృష్ణుడు చతుర్భుజాలతో శంఖచక్రాలతో జన్మి స్తే ఆశ్చర్యపోయి చూసిన దేవకీ వసుదేవులు, శత్రువులు ఎక్కడ గమనిస్తారో అని ఆందోళన పడితే, వాటిని మరుగు పరుస్తాడు. అయితే, ఆ తరువాత యశోదకు, ప్రియమైన గోపికలకు కూడా ఆయన చతుర్భుజాలతో కనిపిస్తాడట.

శంఖమంటే గోపికలకు చాలా ఇష్టం. శంఖం ఎప్పుడూ శ్రీకృష్ణుడి చేతిలోనే ఉంటుంది. అధరాలను తాకుతూ ఉంటుంది. అతను ఊదే గాలితో పలుకుతూ ఉంటుంది. అదే విధంగా గోపికలు కూడా శ్రీకృష్ణ హస్త, అధర సంస్పర్శనం కోరుకుంటూ ఉంటారట. శంఖం ప్రణవ స్వరూపం. దూరంగా ఉన్నవారికి కూడా శంఖనాదంతో తాను అక్కడ ఉన్నట్టు తెలియజేస్తాడు. ఆవుల మంద వదిలి దూరంగా పోయిన ఆవులను శంఖనాదంతో పిలుస్తాడు. దూరమైన జీవులను దరిచేర్చేది శంఖమే. విరోధులకు గుండెలదిరేట్టు చేసి దూరం చేసేదీ శంఖమే.