calender_icon.png 4 August, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వీస్ అంతేనా..

04-08-2025 01:02:34 AM

-ఆర్టీసీలో తొలగించిన కార్మికులకు తిరిగి ఉద్యోగాలు

-వివిధ కారణాలతో ఉద్వాసనకు గురైన సుమారు 1,500 మంది

-మొదటి విడతగా 8 మందిని తిరిగి ఉద్యోగాల్లోకి

-పాత సర్వీసు కోల్పోయేలా, కనీస వేతనానికి చేరేలా ఉత్తర్వులు

-న్యాయం చేయాలని వేడుకుంటున్న కార్మికులు

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాం తి): వివిధ కారణాలతో ఆర్టీసీలో ఉద్యోగా ల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం అనుమతించింది. అ యితే నియామక ప్రక్రియలో విధించిన షరతులే కార్మికులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

30 ఏళ్లకు పైగా సంస్థలో పనిచేస్తున్నా పునర్నియామక ప్రక్రి యలో కొత్తగా ఉద్యోగంలో చేర్చుకుంటున్నట్లుగానే భావిస్తామని, సర్వీసును లెక్కలోకి తీసుకోబోమని, కనీస ప్రారంభ వేతనంతో విధుల్లోకి చేరాల్సిందేనని ఆర్టీసీ యాజమాన్యం నిబంధ న విధించింది. దీంతో ఇన్నేళ్లుగా సంస్థకు సేవ చేస్తున్న తమను ఇలా అన్యాయానికి గురి చేయడమేంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించి, ఇప్పుడు తీసుకుంటున్నా కూడా తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. 

ఏం జరిగింది?

ఆర్టీసీలో వివిధ కారణాలతో సుమారు 1,500 మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించా రు. బ్రీత్ అనలైజర్ టెస్టులంటే ఆర్టీసీ కార్మికులు హడలిపోతారు. సరిగా ముఖం కడుక్కోకపోయినా, నోట్లో కాస్త పాచి ఎక్కువున్నా కూడా తప్పుడు రీడింగ్ కారణంగా మద్యం సేవించినట్లుగా నిర్ణయించి ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. టికెట్ ఇష్యూ మెషీన్ (టిమ్)లో పొరపాట్లకు బాధ్యులను చేస్తూ కొలువులను తీసేయడం, నెక్స్ స్టాప్‌లో ఎక్కాల్సిన రిజర్వేషన్ ప్రయాణికుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసిన సందర్భంలో ప్రయాణికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తే ఉద్యోగాలు కోల్పోవడం, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ల కారణంగా ఇంటికి పంపించడం వంటి కారణాలతో  తమ ఉద్యోగాలు కోల్పోయినట్లు కార్మికులు వాపోతున్నారు. 

ఇప్పుడు ఏం నిబంధనలు పెడుతున్నారు

తమను అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించారని, న్యాయం చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి, డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరినీ కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న ఫలితంగా యాజమాన్యం స్పందించింది.

రిమూవ్‌డ్ ఎంప్లాయీస్‌ను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని పేర్కొంటూ మొదటి విడతగా 8 మంది కార్మికుల లిస్టును ఆర్టీసీ యాజమాన్యం వెలువరించింది. ఇందులో ఉన్న అనేక నిబంధనలు ఎంతో దారుణంగా ఉన్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరినట్లుగా చూపిస్తూ విధుల్లోకి తీసుకోవడం, సర్వీసును పూర్తిగా రద్దు చేయడం అనేది తీవ్ర అన్యాయమని కార్మికులు అంటున్నారు. సర్వీసు నుంచి రిమూవ్ అయిన కొందరిపై కోపంతో అందరిపై కక్ష సాధింపు కరెక్టు కాదని వారు పేర్కొంటున్నారు.

యాజమాన్యం విధించిన షరతులివే..

1. తిరిగి ఉద్యోగంలో చేరిన తర్వాత వారి సీనియారిటీ తీసేస్తారు. వారు తిరిగి విధుల్లో చేరిన రోజు నుంచే మళ్లీ సర్వీసు ప్రారంభమవుతుంది.

2. పునర్నియామక సమయంలో వారి వేతనం సంబంధిత పోస్టుకు కనీస స్థాయిలో మాత్రమే ఫిక్స్ అవుతుంది.

3. గత సర్వీసుకు సంబంధించిన సేవలు లెక్కలోకే రావు. గత సర్వీసులో తీసుకోని సెలవులు ఇప్పుడు లెక్కలోకి రావు.

4. గత సర్వీసు తొలగింపు తర్వాత పొందిన సెటిల్మెంట్ సొమ్ము తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.

5. తిరిగి నియామకం అయ్యే డిపోలో జాయిన్ అయిన తేదీనే వారి ఉద్యోగ ప్రవేశ తేదీగా పరిగణిస్తారు.

6. ఉద్యోగంలోకి తీసుకునే ముందు మూడు దశల్లో మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. 

ఇంతటి శిక్ష వేస్తారా..

చిన్న చిన్న కారణాలతో అనేక మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించారు. తిరిగి వారిని విధుల్లోకి తీసుకుంటున్నందుకు ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. కానీ వారిని తీసుకునే క్రమంలో విధిస్తోన్న నిబంధనలు చాలా అన్యాయంగా ఉన్నాయి. సుమారు 20,30 సంవత్సరాలు సంస్థ కోసం కష్టపడిన వారికి ఇంతటి శిక్ష వేస్తారా?   వాళ్ల సర్వీస్ అంతటినీ తీసేస్తే ఎలా? కొందరు రిటైరయ్యే వయసులో ఇప్పుడు కొత్తగా ఉద్యోగంలో చేరినట్లుగా జీతం ఇస్తే వారి కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకుంటారో యాజమాన్యం ఆలోచించాలి. ఇప్పుడు కేవలం 8 మందిని మాత్రమే ఉద్యోగాల్లోకి తిరిగి తీసుకున్నారు. ఉద్యోగాల నుంచి తీసేసిన వారందరికీ తిరికి అవకాశం కల్పించాలి. వారి సర్వీసును తొలగించకుండా, వేతనాలు తగ్గించకుండా న్యాయం చేయాలి.

 థామస్‌రెడ్డి, టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి