calender_icon.png 4 August, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ కల సాకారంచేసిన నేత

28-12-2024 12:00:00 AM

నిజాయితీకి, నిరాడంబరతకు మారుపేరైన డా. మన్మోహన్ సింగ్‌కు, తెలంగాణ రాష్ట్రానికి అవినాభావ సంబంధం ఉంది. ఆరు దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కల నెరవేర్చిన దేవుడు ఆయన. రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఎన్ని కష్టాలైనా ఓర్పుతో సహించి మనకు రాష్ట్రం ఇచ్చిన మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు. ఆయన హయాంలో తెలంగాణ ఏర్పాటయినందుకు ఒక కాంగ్రెస్ నేతగా, ఒక తెలంగాణ బిడ్డగా గర్వపడుతున్నాను. 

పీవీ ఆహ్వానంతో రాజకీయాల్లోకి..

అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన మన్మోహన్ దేశ పరిస్థితులు, సామాన్యుల స్థితిగతులు క్షుణ్ణంగా తెలిసిన మేధావి కావడంతో ఆయన పదేళ్ల పాలనలో దేశంలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబడ్డాయి.  తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు 1991లో ప్రత్యేక పరిస్థితుల నడుమ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వేళ ఎవరూ ఊహించని విధంగా ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌కు కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించారు. 

దేశ ఆర్థిక రంగానికి క్రమశిక్షణ అవసరం భావించిన పీవీ ఆ చికిత్స కోసం మన్మోహన్ సింగే సరైన వైద్యుడని తలచి స్వయంగా ఆయనకు ఫోన్ చేసి మంత్రివర్గంలోకి ఆహ్వానించారు. ఈ నిర్ణయంపై ఇంటా, బయటా ఎన్ని విమర్శలొచ్చినా వారందరికీ ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే సమాధానాలయ్యాయి. పీవీ, మన్మోహన్ సింగ్ ద్వయం తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ఆర్థిక బలోపేతానికి పునాదులుగా నిలిచాయి.

మృదువుగా కనిపించే మన్మోహన్ సింగ్ కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తులు. ఆయన నేతృత్వంలోని పదేళ్ల యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం, ఆధార్ కార్డు, గ్రామీణ ప్రజల కోసం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, జాతీయ ఆహార భద్రతా చట్టం, విద్యా హక్కు చట్టం వంటి పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 

రైతు రుణమాఫీకి మార్గదర్శకుడు

దేశ ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఆయన వెనకడు గు వేయలేదు. 2008లో అమెరికాతో అ ణుఒప్పందాన్ని అప్పటి ప్రభుత్వంలో భా గస్వాములైన వామపక్షాలు వ్యతిరేకిస్తూ, సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాయి. ఈ సమయంలో ప్రభు త్వం కూలిపోయినా పర్వాలేదని ఆయన పట్టుదలతో, వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో దేశం అప్పుడు ఇంధన సంక్షోభం నుండి గట్టెక్కింది.

మన్మోహన్ సింగ్ పాలనా సమయంలోనే దేశంలో 3 జీ, 4 జీ సేవలు ప్రారంభం కావడంతో మొబైల్ ఫోన్ల సాంకేతిక విప్లవం ప్రారంభమైంది. దేశంలో 3 కోట్ల మంది చిన్న , సన్నకారు రైతులకు రూ.78 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ ప్రభుత్వానికే దక్కింది. ఇప్పటికీ కాంగ్రెస్ అదే ధోరణిని కొనసాగిస్తూ, రైతుల శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణలో రైతు రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే పాతిక లక్షల మందికిపైగా రైతులకు 20 వేల కోట్ల రూపాయలకుపైగా రుణాలను మాఫీ చేసి మాట నిలబెట్టుకుంది.

తెలుగు రాష్ట్రాలకు సమన్యాయం

మేధావులు ప్రజాశ్రేయస్సు దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారని తెలంగాణ ఏర్పాటు విషయంలో మన్మోహన్ సింగ్ నిరూపించారు. అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల కల నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల్లో ఈయన పాత్ర కాదనలేనిది.

మన్మోహన్ నిజాయితీని, పట్టుదలను గుర్తించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ కోసం అత్యున్నత కమిటీని ఆయన నేతృత్వంలో ఏర్పాటు చేశారు.   తెలంగాణ విద్యావేత్త ప్రొఫెసర్ జయశంకర్ నుండి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను తెలుసుకోవడంతో ఆయనకు రాష్ట్ర ఏర్పాటుపై ఒక దృఢమైన అభిప్రాయం ఏర్పడి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమయ్యింది.

తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండడంతో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చడం, అనంతరం ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీ వేయడం, చిదంబరం ప్రకటనవంటి పరిణామాలతో రాష్ట్ర ఏర్పాటు ఖాయమైంది. తెలంగాణపై సొంత పార్టీ నేతలనుండే కాకుండా మిత్రపక్షాలు, ప్రతిపక్షాలనుండికూడా వ్యతిరేకత ఎదురైనప్పుడు మన్మోహన్ సింగ్ వ్యూహాత్మకంగా వ్యవహరించి బిల్లు ఆమోదానికి కృషి చేశారు.

రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా లోక్‌సభలో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు రాజ్యసభకు వచ్చాక బీజేపీ నేతలు ఏపీకి ప్రత్యేక హోదాపై పట్టుబడడంతో, ఆ అంశాన్ని చేర్చితే సాంకేతికంగా అది ఆర్థిక బిల్లుగా మారి మళ్లీ లోక్‌సభకు వెళ్లాల్సి వస్తుందని, ప్రభుత్వం వద్ద తగిన సమయం లేదని భావించిన మన్మోహన్ సింగ్ ఏపీకి కచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇవ్వడంతో తెలంగాణ బిల్లు ఆమోదానికి అడ్డంకులు తొలగి రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమమయ్యింది.

  బిల్లు ఆమోదంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన మన్మోహన్ మాటకు కట్టుబడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వే జోన్ వంటి కీలక హామీలను ఏపీ పునర్విభజన చట్టంలో చేర్చి సోదరుల్లాంటి రెండు తెలుగు రాష్ట్రాలకు సమన్యాయం చేశారు.

నిర్ణయాలతోనే సమాధానం

డా.మన్మోహన్ సింగ్‌ను కొందరు రాజకీయ కారణాలతో కఠిన నిర్ణయాలు తీసు కోలేరని, మౌనముని అని వ్యాఖ్యానించా రు. తెలంగాణ ఏర్పాటుతో పాటు దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు సంస్కరణలతో తిరిగి పట్టాలెక్కించడం, అమెరికాతో అణు ఒప్పందం వంటి అంశాలే వీరికి సమాధానాలు.  కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య 2004లో తొలిసారి ప్రధాన మంత్రి అయిన మన్మోహన్‌సింగ్ ప్రజారంజక పాలన సాగించడంతో యూపీఏ 2009 ఎన్నికల్లో ఆయన్నే తమ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది. ఆయన 33 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎలాంటి మచ్చలు లేవు. 

వైద్య వృత్తి చేపట్టాలని తొలుత ప్రీ మెడికల్ కోర్సులో చేరిన మన్మోహన్ సిం గ్ మధ్యలోనే ఆ చదువు ఆపేసి ఆర్థిక రంగం లో నిపుణులై, అనంతరం రాజకీయాల్లో ప్రవేశించి దేశ ఆర్థిక రంగానికి చికిత్స చేశారు.ఒక సందర్భంలో  విలేకరులతో మాట్లాడుతూ ‘సంకీర్ణ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించిన నాపై మీడియా, విపక్షాలు ఎలా ఉన్నా... చరిత్ర మాత్రం  నాపట్ల సానుకూలంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నాను’ అని ఎంతో నిజాయితీతో అన్నారు.

నేను బెళగావిలో సీడబ్ల్యూసీ సమావేశంలో ఉన్న సమయంలో ఆయన మరణ వార్త తెలిసి షాక్‌కు గురయ్యాను. తెలంగాణ ఏర్పాటుకు ఆయన చేసిన కృషి నా కళ్ల ముందు ఇంకా కదులుతూనే ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత భువనగిరిలో పర్యటించిన డా.మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ సాధ్యం కాకపోయేది అని చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక రంగాన్ని తీర్చిదిద్దిన మన్మోహన్  తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించి తాను మాటల మనిషిని కాదని, చేతల మనిషినని నిరూపించి మనకందరికీ ఆదర్శంగా నిలిచారు.

 వ్యాసకర్త టీపీసీసీ అధ్యక్షుడు