calender_icon.png 25 January, 2026 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ మేడారం!

25-01-2026 12:00:00 AM

వన జాతర మన జాతర 

అమ్మల గద్దెలకు కొత్త సొబగులు

ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటిగా పేరు గడించిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి కొత్త మురిపెం సంతరించుకుంది. ప్రతి రెండేళ్లకోమారు నిర్వహించే మహా జాతర ఈసారి భిన్నంగా, సరికొత్తగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మునుపెన్నడూ లేని విధంగా 250 కోట్ల రూపాయలతో మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టడంతో కొత్త మురిపాన్ని సంతరించుకుంది.

ప్రధానంగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువయ్యే జాతర గద్దెల ప్రాంగణాన్ని రాతి ప్రాకారంతో నిర్మించాలని తలచారు. అలాగే భక్తులు సులువుగా దర్శించుకోవడం, మేడారంలో శాశ్వత ఏర్పాట్ల కోసం, జాతర గద్దెలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఆదివాసీ గిరిజన సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా, ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన వీర వనితలు వన దేవతలుగా కొలువైన సమ్మక్క సారలమ్మ ప్రాశస్త్యాన్ని కళ్లకు కట్టినట్లు వివరించడానికి మేడారం జాతర పునరుద్ధరణకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. వంద రోజుల్లో శాశ్వత ప్రాతిపదికన గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించడం, రాతి శిలలతో సాలారం పనులు చేపట్టారు.

101 కోట్ల రూపాయలతో గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్టంగా రాతితో నిర్మించారు. 46 రాతిశిలలతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గద్దెల ప్రాకారాన్ని నిర్మించారు. 45 అడుగుల వెడల్పుతో 3, 30 అడుగుల వెడల్పుతో, 5 స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఓకే వరుస క్రమంలో ఉండే విధంగా మార్చారు. ఒకేసారి పదివేల మంది భక్తులు దర్శించుకునే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. 

ఆకట్టుకునే శిల్పకళాకృతులు  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంతంలో ప్రత్యేకంగా వెలికి తీసిన గ్రానైట్ రాళ్లను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు తరలించి శిల్పులతో రాతి శిలలపై ప్రత్యేకంగా కళాకృతులు చెక్కించారు. డాక్టర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో స్థపతులు ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ మోతిలాల్ పర్యవేక్షణలో సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన డాక్టర్ మైపతి అరుణ్, 15 మంది విద్యార్థులు రాతి శిలల చిత్ర రూపకల్పనలో భాగస్వాములయ్యారు. వంశపారంపర్య పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల సమ్మతి, సూచనలు, ఆదేశాల ప్రకారం 250 మంది శిల్పులు రాతి శిలలపై బొమ్మలు చెక్కారు.

ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు చెక్కారు. సమ్మక్క రాయి బంధానీ 5వ గొట్టు వంశానికి సంబంధించి ఇంటి దైవం ఒక కొమ్ము ఉండే దుప్పి, రెండువైపులా అడవి దున్న కొమ్ములు, నెమలి ఈకల చిత్రాలను తోరణం అగ్రభాగాన చెక్కారు. ఇక మిగతా శిలలపై మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు గొట్టుల వంశానికి చెందిన చరిత్రలు, వారు పూజించిన జంతువులు జీవనశైలిని తెలిపే చిత్రాలను చెక్కారు. మొత్తంగా 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి 7వేల బొమ్మలు రాతి శిలలపై చెక్కించారు.

సరికొత్త రాతిశిలా ప్రాంగణం  

తాళపత్రాల్లో లభించిన ఆధారాల ప్రకారం కోయవంశీల చరిత్రను గద్దెల ప్రాంగణం రాతి ప్రాకారాలపై చిహ్నాలను, బొమ్మలను చెక్కించారు. పునర్నిర్మాణంలో వనదేవతల పూజల్లో విశిష్టత కలిగిన బండారి, మర్రి, వెదురు, బూరుగ, వేప, ఇప్ప, కస్తూరి వంటి పన్నెండు రకాల చెట్లను, 140 రకాల కు చెందిన ఆయుర్వేద మొక్కలను పెంచడానికి రూపకల్పన చేశారు. సుందరంగా చెక్కించిన రాతి శిలలను భారీ క్రేన్లతో  వందలాదిమంది కార్మికులు, స్తపతులు, శిల్పులు, అధికారులు, స్వయంగా రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ నిరంతర పర్యవేక్షణలో పునరుద్ధరించిన మేడారం గద్దెల సరికొత్త రాతిశిలా ప్రాంగణం ఆవిష్కరణకు సిద్ధమయ్యింది. మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధిలో చేపట్టిన పనులను, సరికొత్త రూపు సంతరించుకున్న మేడారం గద్దెల పునరుద్ధరణ పనులను నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తకోటికి అంకితమివ్వనున్నారు.

అపసవ్యంగా.. శిలా ప్రాకారాల పనులు

మేడారంలో101 కోట్ల రూపాయల వ్యయంతో శాశ్వత ప్రాతిపదికన చేపడుతున్న శిలాప్రాకారం పనుల్లో కొన్ని అపసవ్యంగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వెళ్లు వెత్తుతున్నాయి. శిలా ప్రాకారాలా పైభాగాన ఏర్పాటు చేస్తున్న రాతి శిలలను పలుచోట్ల సరిగ్గా కూర్చోబెట్టడం లేదని, దీనితో కొన్నిచోట్ల ప్రాకారం పైభాగం ఎగుడు దిగుడుగా కనిపిస్తున్నాయని భక్తు లు ఆరోపిస్తున్నారు.  పూర్తిగా రాతి శిలలతో, 200 సంవత్సరాలపాటు చెక్కుచెదరకుండా ఉండేందుకు 101 కోట్ల రూపా యల ఖర్చుతో రాతి ప్రాకారాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రాకారాల్లో పైభాగాన రాతి శిలలకు బదులు సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. 

ఇక మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం రాతి ఫ్లోరింగ్ పనులు ప్రారంభానికి ముందే పలుచోట్ల పగుళ్లు ఏర్పడడం, ఇంకొన్ని చోట్ల పెచ్చులూడిపోవడంతో పనుల్లో నాణ్యత పాటించడం లేదనడానికి నిదర్శనంగా నిలుస్తోందని విమర్శలు వస్తున్నాయి. జాతరకు ముందు శాశ్వత ప్రాతిపదిక పనులు ఆర్భాటంగా చేయడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.  

మేడారం, విజయక్రాంతి

పట్టణాన్ని తలపిస్తున్న మేడారం

మేడారం అభివృద్ధికి చేపట్టిన మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా మేడారం నలువైపులా 10 కిలోమీటర్ల మేర రహదారులను నాలుగు లైన్ల రహదారులుగా విస్తరించడం, జంపన్న వాగులో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడం, విద్యుత్, తాగునీరు, మెరుగైన రవాణా వసతి సౌకర్యం కల్పించడానికి పనులు చేపట్టారు. జంక్షన్‌లను గిరిజన సం ప్రదాయం ఉట్టిపడే విధంగా కళాకృతులు ఏర్పాటుచేసి అభివృద్ధి చేశారు. ములుగు నుంచి మేడారం వరకు తాడ్వాయి, జంగాలపల్లి జంక్షన్ల వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.