calender_icon.png 25 January, 2026 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పగిడిద్దరాజు రాకతోనే మహాజాతర

25-01-2026 12:00:00 AM

యాపలగడ్డ నుంచి మేడారం తరలివెళ్లనున్న పగిడిద్దరాజు

ఆ తర్వాతనే సమ్మక్క- సారలమ్మ జాతర ప్రారంభం 

ఏటా యాపలగడ్డలో మార్చిలో పగిడిద్దరాజు జాతర

ఆసియా ఖండంలో అతిపెద్ద రెండో జాతరగా, భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు గుండాల మండలం యాపలగడ్డలోనే అంకురార్పణ జరుగుతుంది. సమ్మక్క భర్త, సారలమ్మ తండ్రి అయిన పగిడిద్దరాజు స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని యాపలగడ్డ గ్రామం. ఇక్కడి నుంచి పగిడిద్దరాజు ములుగు జిల్లాలోని మేడారానికి చేరుకుంటేనే జాతరకు బీజం పడుతుంది.

రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు అరెం వంశానికి చెందిన పగిడిద్దరాజును గ్రామానికి చెందిన ఆ వంశీయులు తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. పగిడిద్దరాజు రాకతోనే మేడారం సమ్మక్క జాతర ప్రారంభం అవుతుంది.

అరెం వంశీయుడిగా ప్రసిద్ధి

పగిడిద్దరాజు యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం- వంశీయుడని, మూడు తరాలుగా కొలుస్తున్నామని ఆ వంశీయులు చెబుతున్నారు. నాటి ఆభరణాలు, ఈటెలు, బల్లెం తదితర వస్తువులు ఇప్పటికీ గుడిలో భద్రపరిచే ఉంటాయి. గ్రామ సమీపంలోని తొట్టివాగు వద్ద -పగిడిద్దరాజు, సమ్మక్కల గద్దెలు నిర్మించి ఏటా మార్చి మొదటివారంలో పగిడిద్దరాజు జాతర నిర్వహిస్తున్నారు. రెండేళ్లకోసారి ఇక్కడి నుంచే మేడారం జాతరకు పడగల (జెండాల)ను పగిడిద్ద యాపలగడ్డ సమీపంలో పగిడిద్దరాజు- సమ్మక్క గద్దెలు, రాజును కాలినడకన తీసుకెళ్తారు. రాజు వెళ్లాకే మేడారంలో జాతర ప్రారంభమవుతుంది. 

70 కిలోమీటర్లు కాలినడకన..                      

యాపలగడ్డలో ఉన్న పగిడిద్దరాజు గర్భగుడి నుంచి పడగలకు(జెండాలకు), శివసత్తులకు పురాతన కాలంనాటి ఆభర ణాలకు పూజారులు (వడ్డెలు) ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 70 కిలోమీటర్లు కాలినడకన ముందుగా బయలుదేరి జాతర నాటికి చేరుకున్నాక అక్కడ జాతర మొదలవుతుంది. వీరితో పాటు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనుగొం డ్ల గ్రామానికి చెందిన అరెం వంశీయులు కూడా పాల్గొంటారు. పగిడిద్దరాజు గద్దెల వద్దకు తీసుకెళ్లి అక్కడ పూజలు చేస్తారు. జాతర అనంతరం పడగలను తిరిగి యాపలగడ్డకు చేర్చుతారు.                                                       

అసౌకర్యాల నడుమ..            

మేడారం జాతరకు గుండాల మీదుగా వెళ్లే భక్తులు పగిడిద్దరాజును దర్శించుకుని వెళ్తారు. ఇక్కడ కూడా వంటావార్పు చేసుకుంటారు. ఇక మార్చిలో జరిగే పగిడిద్దరాజు జాతరకు వేలసంఖ్యలో భక్తులు తరలివస్తారు. కానీ కనీస సౌకర్యాలు లేవు. పగిడిద్ద రాజు ఆలయానికి నిధులు ఇవ్వాలని మేడారం ట్రస్టును, ఐటీడీఏ అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని అరెం వంశీయులు అంటున్నారు. గద్దెల వద్ద ప్రహరీ లేదని, భక్తులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేవని, ఆర్చ్ లు, సీసీ రోడ్లు లేవని, మేడారం జాతరలో పగిడిద్ద రాజు నుంచి వస్తున్న మూడో వంతు డబ్బులతో ఇక్కడ జాతర ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు. గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకోవడంతోపాటు శుభకార్యాలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి అభివృద్ధి పనులు చేపట్టాలని, ఫంక్షన్ హాల్ కూడా నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఏటా అడుగుతున్నాం..!

మేడారం ట్రస్టుతో పాటు ఐటీడీఏ అధికారులను ఏటా గద్దెల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు. మేడారంలో రూ.కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని, ప్రభుత్వం ఇక్కడ కూడా దృష్టి పెట్టాలని వేడుకుంటు న్నారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ప్రహరీ, సీసీ రోడ్లు, ఆర్చ్‌లు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 అన్నారపు వెంకటేశ్వర్లు, ఇల్లెందు, విజయక్రాంతి