30-04-2025 12:00:00 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): 500 జనాభాకు మించి ఉన్న గిరిజన ఆవాస ప్రాంతాలను 2018 లో అప్పటి ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ప్రకటించింది. ఈ విధంగా మహబూబాబాద్ జిల్లాలో 200కు పైగా కొత్తగా గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. అదే ఏడాది ఆగస్టు నెలలో గ్రామాల్లో తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాలలు, అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ కార్యాలయాల భవనాల్లో కొత్త పంచాయతీలను ప్రారంభించారు.
మరికొన్ని చోట్ల అద్దె ఇండ్లల్లో పంచాయతీలను ఏర్పాటు చేశారు. అనంతరం కొత్తగా ఏర్పడ్డ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి సర్పంచులు వార్డు సభ్యులను ఎన్నుకున్నారు. అయితే కొత్తగా గ్రామాలకు సర్పంచులు నియమితులై ఐదేళ్ల పదవీకాలం పూర్తయి వారు పదవుల నుంచి దిగిపోయిన ఇప్పటివరకు కొత్తగా ఏర్పడ్డ పంచాయతీలకు భవనాలు నిర్మించలేదు.
ఫలితంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడ్డ రెండు వందల పైగా గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగుతున్నాయి. దీనితో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చదువుకు ఆటంకంగా మారింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 482 పంచాయతీలు ఉండగా అందులో 187 పాత పంచాయతీలకు పక్కాభవనాలు ఉన్నాయి.
ఇందులో కూడా 19 గ్రామాల్లో శిథిలంగా మారి వినియోగించుకోవడానికి అనుకూలంగా లేవు. ఇక కొత్తగా ఏర్పడ్డ 200 కు పైగా గ్రామపంచాయతీలు ఆయా ఆవాస ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగిస్తున్నారు. కొత్తగా ఏర్పడ్డ పంచాయతీలకు పక్కా భవనాలను నిర్మించడానికి 20 లక్షల వ్యయం అంచనా తో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 112 షెడ్యూల్ ఏరియా గ్రామాల్లో, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 132 గ్రామాల్లో రెండేళ్ల క్రితం నిధులు మంజూరు చేశారు.
అయితే అనేక గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలం లేకపోవడంతో పాటు సర్పంచుల పదవి కాలం దగ్గర పడుతుండడంతో పంచాయతీల భవనాలు నిర్మిస్తే బిల్లులు వస్తాయో రావో అన్న అపోహతో భవన నిర్మాణాలను చేపట్టడానికి ఆసక్తి చూపలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి అడుగు ముందుకు పడలేదు.
ఇంతలో వారి పదవీకాలం ముగిసిపోవడం, ఏడాది దాటిన కొత్తగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ప్రత్యేక అధికారులు గ్రామ పరిపాలన నిర్వహించడమే కష్టతరంగా మారిన నేపథ్యంలో నూతన భవనం నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. దీనివల్ల మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడ్డ గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం అటకెక్కింది.
జిల్లావ్యాప్తంగా అధికంగా ప్రభుత్వ పాఠశాలల్లో పంచాయతీ కార్యాలయాలను నిర్వహిస్తుండగా, కొన్నిచోట్ల అద్దె ఇంట్లో నిర్వహిస్తున్నారు. చిన్న పంచాయతీలకు ఆదాయం ఆశించినంతగా లేకపోవడం వల్ల పంచాయతీ కార్యాలయం అద్దె చెల్లింపు పెద్ద సమస్యగా మారింది.
ఇటీవల మోట్లగూడెం గ్రామంలో అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న పంచాయతీ కార్యాలయాన్ని ఇంటి యజమాని ఉన్నఫలంగా ఖాళీ చేయించడంతో అప్పటికప్పుడు పంచాయతీ కార్యాలయం రికార్డులు భద్రపరచడానికి (గుంచీ) రేకు డబ్బాను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం స్పందించి కొత్తగా ఏర్పడ్డ గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాన్ని కేటాయించి, నిధులు మంజూరు చేసి నిర్మాణాలను త్వరిత గతిన చేపట్టి, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి పల్లెల్లో గ్రామ స్వరాజ్యం నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
భవనాల లేమితో పరిపాలనకు ఆటంకం
గ్రామాల్లో పంచాయతీలకు పక్కా భవనాలు లేకపోవడం వల్ల పరిపాలన, ప్రజలకు సేవ చేసే విధంగా నిర్వహించలేక పోయాం. పాఠశాలల్లో పంచాయతీలను నిర్వహించడం వల్ల పాఠశాల నిర్వహణకు ఆటంకం కలగడంతో పాటు పంచాయతీ సమావేశాలు సక్రమంగా నిర్వహించలేకపోయాం.
గ్రామాల అభివృద్ధికి ముఖ్యంగా గ్రామపంచాయతీ భవనం ఎంతో అవసరం. గ్రామా ల్లో పంచాయతీ భవనాలకు అవసరమైన స్థలం లేదు. ప్రభుత్వం స్థలం కేటాయించడంతోపాటు నిధులు విడుదల చేసి పంచాయ తీలకు భవనాలు నిర్మిస్తే తప్ప గ్రామాల్లో ప్రజా పాలన సాగించే పరిస్థితి లేదు.
మామిడి శోభన్ బాబు,
మాజీ సర్పంచ్, అయ్యగారి పల్లి