నిర్మల్ కలెక్టర్‌కు హైకోర్టులో ఊరట
కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ జడ్జి తీర్పు నిలిపివేత
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): ఆరోగ్య కార్యకర్తల వేతనాల చెల్లింపులో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన కేసులో నిర్మల్ జిల్లా కలెక్టర్ మహమ్మద్ ముషారఫ్ అలీ ఫరూఖీ, మున్సిపల్ కమిషనర్ ఏ సంపత్‌కుమార్‌కు గురువారం హైకోర్టులో ఊరట లభించింది. వేతనాలు చెల్లించాలన్న కోర్టు ఆదేశాలను 15 రోజుల్లో అమలుచేయకుంటే కలెక్టర్‌కు నెల రోజుల జైలుశిక్ష, రూ.2000 జరిమానా, మున్సిపల్ కమిషనర్‌కు 15 రోజుల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మినారాయణతో కూడిన ధర్మాసనం నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ఉద్యోగంలో చేరి ఆరు నెలలైనా వేతనాలు ఇవ్వటంలేదని నిర్మల్ మున్సిపాలిటీకి చెందిన 44 మంది ఆరోగ్య కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. వాటిని విచారించిన ధర్మాసనం వెంటనే వేతనాలు చెల్లించాలని 2022 సెప్టెంబర్‌లో ఆదేశించింది. కానీ, కోర్టు ఆదేశాలను అధికారులు అమలుచేయలేదు. దీంతో పిటిషనర్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలుచేశారు. వాటిని విచారించిన సింగిల్ జడ్జి ధర్మాసనం 15 రోజుల్లోగా వేతనాలు చెల్లించాలని, లేదంటే శిక్ష తప్పదని ఈ నెల 3న ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్‌చేస్తూ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కోర్టుకు వెళ్లటంతో సింగిల్ జడ్జి ఆదేశాలను నిలిపివేస్తూ ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీచేసింది.






