calender_icon.png 1 July, 2025 | 9:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ సేవలో కొత్త సేవలు

01-07-2025 01:31:27 AM

  1. అందుబాటులోకి మ్యారెజ్ సర్టిఫికెట్..
  2. మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్ 
  3. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): తెలంగాణ ఈ--గవర్నెన్స్‌కు ప్రతీకగా నిలిచిన మీ-సేవ.. పౌర సౌకర్యాల విస్తరణలో మరో ముందడుగు వేసింది. రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, భూముల మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్ వంటి కొత్త సేవలను సోమవారం ఆవిష్కరించింది. వీటి కోసం స్లాట్ బుకింగ్ వ్యవ స్థ అందుబాటులోకి వచ్చింది.

నూతన పౌర సేవల ప్రారంభం, మీ-సేవా కార్యక్రమాల పనితీరును మంత్రి శ్రీధర్‌బాబు సచివాలయంలో సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఐటీ మంత్రి మాట్లాడుతూ.. ఈ కొత్త సేవల ద్వారా ప్రజల కు మరింత పారదర్శకతతో కూడిన పాలన అందుతుందని చెప్పారు. భూమి, అపార్ట్‌మెంట్ విలువల అంచనాలను 24 గంటల్లోపు ఆమోదించేలా చర్యలు చేపడుతున్నట్టు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇకపై సమర్థవంతంగా కొనసాగుతుందని తెలిపారు.

‘మీ-సేవ సెంటర్ లేదా ఆన్‌లైన్‌లో జిల్లా, గ్రామం వంటి వివరాలను సమర్పించి భూమికి సంబంధించిన తాజా మార్కె ట్ విలువను పొందొచ్చు. ఈ దరఖాస్తులను సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం త్వరితగతిన పరిశీలించి నిర్ణయిస్తుంది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనూ స్లాట్ బుకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాం. దరఖాస్తుదారులు పెళ్లి ఫొటోలు, చిరునామా రుజువు, వయసు ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి.

ఆమోదం అనంతరం సర్టిఫికెట్‌ను ప్రత్యక్షంగా సబ్-రిజిస్టార్ ఆఫీస్ నుంచి జారీ చేస్తారు. ఈ సేవల ద్వారా ప్రజలు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. నిర్మాణ రంగం, స్థిరాస్తి  కొనుగోళ్లు చేయాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుంది’ అని తెలిపారు. 

ఈ కొత్త సేవలు అందుబాటులోకి తీసుకురావడం, రాష్ర్ట డిజిటల్ గవర్నెన్స్ దిశగా మరో కీలక అడుగు వేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే మీ-సేవాలో ఇసుక బుకింగ్ వంటి సేవలు మిళితమయ్యాయని, ఇకపై టీ-ఫైబర్, అదనపు కియాస్క్‌లు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేస్తామన్నారు.