calender_icon.png 28 January, 2026 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్వాపురంలో సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ..

28-01-2026 12:52:36 AM

  1. అమాయకుడి ఇంటికి క్యూ కట్టిన జనం!

లోన్ పేరుతో మోసపూరిత కాల్స్.. ఒక్కరి కోసం 15 మంది పడిగాపులు

అవన్నీ స్పామ్ కాల్స్.. లింకులు క్లిక్ చేయవద్దు: అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి హెచ్చరిక

అశ్వాపురం, జనవరి 27 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసేలా కొత్త తరహా మోసాలకు తెరలేపారు. అశ్వాపురం మండలంలో  మంగళవారం  జరిగిన ఓ సంఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. అపరిచిత లింకులు క్లిక్ చేయకూడదని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

లోన్ పేరుతో వల..

 అశ్వాపురం మండలానికి చెందిన ఓ వ్యక్తికి సైబర్ కేటుగాళ్ళ నుండి ఫోన్ వచ్చింది. ‘మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 40,000 లోన్ తీసుకున్నారు. ఇప్పుడు అర్జంటుగా రూ. 11,500 కడితే లోన్ క్లోజ్ చేస్తాం. మీకు మెయిల్ లో పంపించే లింక్ క్లిక్ చేసి డబ్బు చెల్లించండి‘ అని నమ్మబలికారు. తాను ఎలాంటి లోన్ తీసుకోలేదని గ్రహించిన ఆ వ్యక్తి, ఇది మోసమని భావించి ఫోన్ కట్ చేసి, మొబైల్ స్విచ్ ఆఫ్ చేశారు.

ఇంటి చుట్టూ బాధితులు ..

సదరు వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన కాసేపటికే.. ఇద్దరు వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చి, ‘మా పేరుతో ఎస్బీఐ(SBI)లో లోన్ తీసుకున్నావట.. డబ్బులు కడతావా లేదా?‘ అని ప్రశ్నించారు. ఆశ్చర్యపోయిన బాధితుడు వారికి అసలు విషయం వివరించడంతో వారు వెనుదిరిగారు. కానీ, ఆ తర్వాత ఒకరి వెనుక ఒకరు.. ఇలా దాదాపు 15  మంది వరకు బాధితుడి ఇంటికి వచ్చి ప్రశ్నించడం కలకలం రేపింది. సైబర్ నేరగాళ్లు బాధితుడి వివరాలను దుర్వినియోగం చేస్తూ, అమాయకులను వారి ఇంటికి పంపించి గందరగోళం సృష్టించినట్లు తెలుస్తోంది.

పోలీసుల భరోసా ..

ఈ పరిణామంతో ఆందోళన చెందిన బాధితుడు, తన ఇంటికి వచ్చిన వారితో కలిసి అశ్వాపురం సిఐ ని ఆశ్రయించారు. సిఐ వెంటనే స్పందిస్తూ.. ‘ఇవి ముమ్మాటికీ సైబర్ నేరగాళ్ల పనులే. ఇవి కేవలం స్పామ్ కాల్స్ (Spam Calls) మాత్రమే. వీటిని నమ్మి ఎవరూ ఆందోళన చెందవద్దు‘ అని బాధితులకు ధైర్యం చెప్పారు.

ప్రజలకు విజ్ఞప్తి ..

అశ్వాపురం మండల ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి సూచించారు. ఎవరైనా లోన్ కట్టమని ఫోన్ చేసి, లింకులు పంపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే స్పామ్ కాల్స్ కు స్పందించవద్దు.

అనుమానం వస్తే వెంటనే పోలీసులను సంప్రదించండి. మరిన్ని వివరాలకు సైబర్ మోసాలపై ఫిర్యాదు చేయడానికి 1930 నంబర్ కు కాల్ చేయండి అని తెలిపారు .