25-10-2025 01:02:26 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 24 (విజయక్రాంతి) : ఎన్నికల ముందు నిరుద్యోగ యువతను వాడుకుని, అధికారంలోకి వచ్చాక వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగిలి తీరుతుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల భద్రత లేకుండా ఒక్కసారి అశోక్‌నగర్‌కు రావాలని సవాల్ విసిరారు.
తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో నిర్వహించిన కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు కాంగ్రె స్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సభలు పెట్టించి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే అన్నీ మరచిపోయి మోసం చేశారు.
వారు విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ కాదు, అదొక ‘జాబ్‌లెస్’ క్యాలెండర్ అని, రాజీవ్ యువ వికాసం పథకం వికసించకముందే వాడిపోయింది’ అని ఎద్దేవా చేశారు. ఉద్యో గ నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాని ప్రభుత్వం, రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చిందని విమర్శించారు. ‘ఆనాడు కాంగ్రెస్‌ను గెలిపించడానికి బస్సు యాత్రలు చేసిన నిరుద్యోగులే, ఇప్పుడు కాంగ్రెస్‌కు సురుకు పుట్టించడానికి జూబ్లీహిల్స్‌లో ఆ పార్టీని ఓడించాలని, నిరుద్యోగులే కాంగ్రెస్‌ను ఓడించారనే విషయం రాహుల్ గాంధీకి అర్థమయ్యేలా చేయాలి’ అని పిలుపునిచ్చారు.
నింపేది జాబులు కాదు..
ప్రభుత్వం జాబులు నింపడం పక్కనపెట్టి, జేబులు, గల్లా పెట్టెలు నింపుకోవడంలో ఉందని హరీశ్‌రావు ఆరోపించారు. పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యా రని, కేవలం కలెక్షన్లు, వసూళ్ల మంత్రిగా మాత్రమే పాస్ అయ్యారని తెలిపారు. విద్య రాని వ్యక్తి విద్యాశాఖ మంత్రి అయితే, అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి హోం మంత్రిగా ఉన్నారు అని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 1.64 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని, 95 శాతం స్థానిక రిజర్వేషన్ సాధించిందని గుర్తు చేశారు. నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్‌ఎస్, పరీక్షలు పెట్టింది బీఆర్‌ఎస్, నియామకపత్రాలు ఇచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి. అచ్చంగా కాంగ్రెస్ ఇచ్చింది కేవలం 10 వేల ఉద్యోగాలు మాత్రమే అని తెలిపారు.
అండగా ఉంటా: ఆర్ కృష్ణయ్య
జెన్‌కో, జీపీవో, పోలీసు, డిప్యూటీ సర్వేయర్, ఇతర గ్రూప్స్ నోటిఫికేషన్ల విషయం లో రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా నిద్రమొద్దు వైఖరి అవలంబిస్తోందని రాజ్యసభ సభ్యు డు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ‘ఈ బాకీ కార్డుల కార్యక్రమం ఇక్కడితో ఆగిపోవద్దు. రాష్ర్టంలోని అన్ని జిల్లా కేంద్రాలకు వెళ్లి నిరుద్యోగ యువతను ఏకం చేయాలన్నారు. నిరుద్యోగుల పోరాటానికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.
గ్యారంటీ కార్డులే బాకీ కార్డులుగా..
సీపీఎం రాష్ర్ట కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ... కాంగ్రెస్ గ్యారంటీ కార్డులే ఇప్పుడు బాకీ కార్డులుగా మారాయని, నిరుద్యోగుల హక్కుల సాధన కోసం జరిగే ప్రతి పోరాటానికి ఎర్రజెండా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ నేత ఏను గుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, బాకీ ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఈ బాకీ కార్డును ఆవిష్కరించామని తెలిపారు. ఈ కార్డులను గ్రామగ్రామానికి, ఢిల్లీలోని రాహుల్, ప్రియాంక గాంధీల వద్దకు కూడా తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గెల్లు శ్రీనివాస్ యాదవ్, పలువురు నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.