25-10-2025 12:27:04 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : రాష్ర్ట రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై పూర్తి స్పష్టత వచ్చేసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగియడంతో, తుది సమరంలో 58 మంది అభ్యర్థులు మిగిలినట్లు రిటర్నింగ్ అధికారి సాయిరాం అధికారికంగా ప్రకటించారు.
చరిత్రలో తొలిసారి ఇంతమంది పోటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, పరిశీలన అనంతరం 81 మంది నామినేషన్లను అధికారులు ఆమోదించారు. అయితే, ఉపసంహరణ చివరి రోజున 23 మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకోవడంతో, తుది అభ్యర్థుల సంఖ్య 58కి చేరింది. నియోజకవర్గ చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీలో నిలవడం ఇదే ప్రథమం కావడం గమనాం.
గతంలో 2009లో 13 మంది, 2014లో 21, 2018లో 18, 2023లో కేవలం 19 మంది మాత్రమే ఇక్కడి నుంచి పోటీ చేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలుపొందిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు, ఈసారి బరిలో నిలిచిన వారిలో అధికశాతం మంది తమ నిరసనను వ్యక్తం చేసేందుకే నామినేషన్లు వేసినట్లు స్పష్టమవుతోంది.
ప్రభుత్వ విధానాలపై తమ నిరసన గళాన్ని వినిపించేందుకు వివిధ వర్గాల ప్రజలు ఎన్నికల ప్రక్రియను ఒక ఆయుధంగా మలుచుకున్నారు. వీరిలో రీజినల్ రింగు రోడ్డు భూసేకరణ బాధితులు 12 మంది, యాచారం ఫార్మాసిటీ భూ నిర్వాసితులు 10 మంది, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరే కంగా 10 మంది, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ తరఫున 13 మంది, పింఛన్ల సమస్యలపై 9 మంది సీనియర్ సిటిజన్లు, తెలం గాణ ఉద్యమకారుల తరఫున ఒకరు నామినేషన్లు వేసి బరిలో నిలిచారు.
ఈ భారీ సం ఖ్యలోని అభ్యర్థులు, వారి నిరసన రూపంలోని నామినేషన్లతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ర్టవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తుది జాబితా ఖరారు కావడంతో, ఎన్నికల అధికారులు అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. అనంతరం ప్రచారం మరింత హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.