calender_icon.png 25 October, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతస్తుల దందా.. అధికారుల మౌనం

25-10-2025 12:20:48 AM

  1. రెండు అంతస్తులకు అనుమతి.. ఆరు, ఏడు అంతస్తుల నిర్మాణం
  2. రోడ్లను కబళిస్తున్న బిల్డర్లు.. ఇబ్బందుల్లో కొనుగోలుదారులు
  3. మున్సిపల్ కార్యాలయం ఎదుటే అక్రమ కట్టడం
  4. సిబ్బంది లేరంటున్న కమిషనర్

మణికొండ, అక్టోబర్ 24, (విజయక్రాంతి) : మణికొండ మునిసిపాలిటీ పరిధి లో కొందరు బిల్డర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ భవన నిర్మాణాలు చేపడుతు న్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్, డాలర్ హిల్స్, సెక్రటేరియట్ కాలనీ, జనచైతన్య లేఅవుట్, పంచ వటి కాలనీ వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఈ అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

రెండు, మూడు అంతస్తులకు అనుమతులు పొంది, ఆరు నుంచి ఏడు అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. రోడ్లను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుండటంతో కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్కాపూర్ నేతాజీ పార్క్ ముందు గల్లీలో 400 గజాల స్థలంలో ఐదు ఫ్లోర్లు, పెంట్ హౌస్ నిర్మిస్తుండగా, జనచైతన్య లేఅవుట్లో 200 గజాల స్థలంలోనే ఐదు, ఆరు ఫ్లోర్ల నిర్మాణాలు వెలుస్తున్నాయి.

మున్సిపల్ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం సర్వసాధారణంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. విచి త్రం ఏమిటంటే, మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగానే ఒక అక్రమ నిర్మాణం జరుగుతున్నా కమిషనర్ చూస్తూ చూడనట్టు ఉండటం వెనుక మతలబేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా అక్ర మ నిర్మాణాలకు అడ్డుకట్ట పడటం లేదని వారు వాపోతున్నారు.

ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ను వివరణ కోరగా, అక్రమ నిర్మాణదారులందరికీ నోటీసులు జారీ చేశామని, త్వరలో కూల్చివేతలు జరుపుతామని చెప్పారు. అయితే, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దీర్ఘకాలిక వైద్య సెలవులో ఉన్నారని, నూతనంగా వచ్చిన అధికారి వారంలో రెండు రోజులే అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. కూల్చివేతలకు సరైన సిబ్బంది లేరని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి టౌన్ ప్లానింగ్ సిబ్బందిని సమకూర్చాలని కోరతానని ఆయన తెలియజేశారు.