25-10-2025 12:37:45 AM
-దొడ్డిదారి పదోన్నతులపై కన్ను
-కోర్టు కేసున్నా ఆగని ఫైళ్లు
-అనర్హులకు అందలానికికుట్ర ముడుపుల చుట్టూ పదోన్నతులు..?
-పరిపాలన నవ్వులపాలు
-ఓ అధికారిపై ఆరోపణలు
నిజామాబాద్/డిచ్పల్లి, అక్టోబర్ 24 (విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ మరోసారి తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. వర్సిటీలో అక్రమ పదోన్నతుల తతంగం తెరపైకి రావడం, ఈ వ్యవహారం వెనుక పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం తీవ్ర కలకలం రేపుతోంది. 2014 నాటి వివాదాస్పద నియామకాలకు సంబంధించిన కేసు కోర్టులో నడుస్తుండగానే, నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కట్టబెట్టేం దుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
కోర్టు తీర్పున్నా తొందరే ఎందుకు..
యూనివర్సిటీలో 2014లో జరిగిన నియామకాలు మొదటి నుంచీ వివాదాస్పదంగా ఉన్నాయి. సుమారు 30 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 20 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై అప్పట్లో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నియామకాలపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా, డబ్ల్యూపీ నెం. 11135 కింద కేసు విచారణలో ఉంది. ఈ నియామకాలు, తదనంతర చర్యలు కోర్టు తుది తీర్పునకు లోబడే ఉండాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ, వర్సిటీ అధికారులు ఆ వివాదాస్పద నియామకాల జాబితాలో ఉన్నవారికే ఇప్పుడు పదోన్నతులు ( కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్) కల్పించేందుకు ఫైళ్లను పరుగులు పెట్టిస్తున్నారని సమాచారం.
జీవోల్లో గందరగోళం.. అర్హతల్లో అనుమానాలు..
పదోన్నతుల కోసం మొదట జీవో 14 ప్రకారం దరఖాస్తులు స్వీకరించిన అధికారులు, ఇప్పుడు కొందరికి లబ్ధి చేకూర్చేందుకు జీవో15ను కూడా తెరపైకి తెచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం పదోన్నతి పొందాలంటే నిర్దిష్ట సంఖ్యలో పరిశోధన పత్రాలు (రీసెర్చ్ పేపర్లు) యూజీసీ కేర్ లిస్ట్లో ప్రచురితమై ఉండాలి. అయితే, ప్రస్తుతం పదోన్నతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి, కనీసం ఒక్కరికి కూడా నిబంధనల ప్రకారం సరైన పరిశోధన పత్రాలు లేవన్నది బహిరంగ రహస్యం. పాత జీవో ప్రకారం అవసరమైన అర్హతలు, పరిశోధన పత్రాలు లేకపోయినా, ఉన్నతాధికారులు కేవలం ముడుపులే కేంద్రంగా అనర్హులకు అందలమెక్కిస్తున్నారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
అంతుచిక్కని ‘సోషల్ సైన్స్’ ఫైల్.. సస్పెన్షన్ సర్వీసుల మతలబు..
వర్సిటీలోని కామర్స్, లా, ఫార్మసీ, కంప్యూటర్ సైన్స్ వంటి అన్ని విభాగాల్లో పదోన్నతుల కోసం స్క్రూటినీ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే, ఒక్క సోషల్ సైన్స్ విభాగానికి సంబంధించిన ఫైలును మాత్రం ఉన్నపళంగా ఆపివేయడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. లోలోపల జరుగుతున్న అవినీతి బాగోతమే దీనికి కారణమని వినిపిస్తుంది. స్వలాభం కోసం ఇష్టరీతిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఓ ముఖ్య పరిపాలనా అధికారి ఇదంతా నడిపిస్తున్నారని వర్సిటీ కోడై కూస్తోంది.
ఒంటెద్దుపోకడలు పోతున్నా సదరు అధికారిపై, విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షాత్తూ సదరు అధికారి విద్యార్హతపైనే అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు. మూడేళ్ల కోర్సు రెండేళ్లలో ఎలా చేశారో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నామని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం విచారణలో ఉండగానే , సదరు అధికారి సచ్చిల్లుడి మాదిరి, పదవులు, పదోన్నతులు అనుభవించడం జరుగుతుందని పేర్కొంటున్నారు. పైపెచ్చు తానో నికార్సయిన అధికారిగా చెప్పుకుంటూ, కింది ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం విశేషం.
ఇలాంటి అధికారి వల్లనే, కోర్టు పరిధిలోనున్న పదోన్నతుల ఫైల్, మల్లిపురుడు పోసుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాల భాగోతంలో భాగంగా, గతంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా పనిచేసి సస్పెన్షన్కు గురైన ఓ సహా ఆచార్యుడికి (కామర్స్ విభాగం) సైతం పదోన్నతి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అతని సస్పెన్షన్ కాలాన్ని సర్వీసుగా ఎలా పరిగణలోకి తీసుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే తరహాలో రిజిస్ట్రార్గా గతంలో పనిచేసి, సస్పెన్షన్ వేటుకు గురైన మరో అధికారిపై ఇంతవరకు మెమో కూడా ఇవ్వని ఉన్నతాధికారులు, ఇప్పుడు ఆయనకు పదోన్నతి కోసం స్క్రూటినీ ఎలా నిర్వహిస్తారన్నది అంతుచిక్కడం లేదు. నిబంధనలకు వ్యతిరేకంగా వీరి సస్పెన్షన్ కాలాన్ని కూడా సర్వీసులోకి జోడిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పదోన్నతుల అక్రమాలకు బలం చేకూరుస్తున్నాయి.
ఆయన దెబ్బకు ఇరకాటంలో వీసీ..
ఈ అక్రమాల తతంగం మొత్తం ఓ ప్రధాన పాలన అధికారి కనుసన్నల్లోనే జరుగుతోందని, ఆయన ఒంటెద్దు పోకడల వల్లే వైస్ ఛాన్సలర్ యాదగిరి రావు ఇరకాటంలో పడుతున్నారని వర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యూనివర్సిటీలో విద్యార్థులకు కనీస వసతులైన హాస్టళ్లు, మరుగుదొడ్లు వంటివి కల్పించడంపై దృష్టి పెట్టలేని ఉన్నతాధికారులు, కోర్టు వివాదాల్లో ఉన్న నియామకాలకు, అర్హతలు లేనివారికి పదోన్నతులు కల్పించడం కోసం ఇంతగా ఆరాటపడటం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గవర్నర్ లేదంటే యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పేషీ ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని విద్యార్థి సంఘాలు, మేధావులు కోరుతున్నారు.
లేదంటే తామే గవర్నర్ ను కలిసి, న్యాయం కోరుతామని హెచ్చరిస్తున్నారు. ఆందోళనకు సిద్ధమని ప్రకటిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని, అనర్హులకు పదోన్నతులు రాకుం డా చూడాలని కోరుతున్నారు. సచ్చీలుడిగా నటిస్తూ, చాపకింద నీరులా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సదరు పరిపాలన అధికారిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రెగ్యులర్ ప్రొఫెసర్ల అర్హతలపై పూర్తి విచారణ జరపాలని, కోర్టు ఆదేశాలకు లోబడి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే, సదరు ప్రొఫెసర్లు రిటైర్డ్ అయితే, వాళ్ళు పొందిన సొమ్ము ఎలా రికవరీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
2014 రిక్రూట్మెంట్ అక్రమమని కోర్టులో కేసులున్నపుడు, వాళ్ళ ఎంపికనే చెల్లదని వాదిస్తున్నప్పుడు, అర్ధరాత్రి జాబ్‌లో జాయిన్ అయిన ఉద్యోగు లకు, ఇంకా పదోన్నతి ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటున్నారు. ఇకనైనా వీసీ యాదగిరి రావు ఆలోచించి, వర్సిటీ పరువు గంగలో కలవకుండా చూడాలని విన్నవిస్తున్నారు. యూనివర్సిటీకి నష్టం చేకూర్చవద్దని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్నత విద్యామండలి, వీసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ప్రస్తుతం విద్య శాఖ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏదైనా తేడా జరిగితే, అధికారులంతా జైలు ఊచలు లెక్కించక తప్పదని, దీన్ని వర్సిటీ అధికారులు గుర్తించాలని హెచ్చరిస్తున్నారు. మరి ఉన్నతాధికా రులు ఏం చేస్తారో చూడాలి.