25-10-2025 01:14:31 AM
బీసీ రిజర్వేషన్ సాధన సమితి మహా ధర్నా
ముషీరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధమేనని పలువురు వక్తలు హె చ్చరించారు. బీసీలకు రాజ్యాధికారం ద్వారా నే సమస్యలు పరిష్కారం అవుతాయని వారు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
మాజీ ఐఏఎస్ అధికారి, బీసీ మేధావుల ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు అధ్యక్షతన జరిగిన మహాధర్నాలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, ఫెడరేషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ చైర్మన్, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీలు వీ హనుమంతరావు, బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధు యాష్కీ, మాజీ డీపీ ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త పూర్ణచంద్రరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, కన్వీనర్ ఐలు వెంకన్నగౌడ్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జీ కిరణ్ కుమార్, ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్, అంబాల నారాయణగౌడ్ తదితరులు హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే 9వ షెడ్యూల్‌లో తప్పనిసరిగా చేర్చాల్సిందేనని స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాధికారం ద్వారానే అన్ని రంగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. కోర్టుల్లో బీసీలకు సమన్యాయం జరగడంలేదని తెలిపారు. తమిళనాడులో బీసీలకు 69% రిజర్వేషన్లు అమలు జరిగాయని అదే తరహాలో పోరాటాలు చేసి సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ బీసీలను అడుగడుగునా మోసం చేస్తున్నదని విమర్శించారు. కులగణన తప్పులతడకగా నిర్వహించి డెడికేషన్ కమిటీ పేరుతో చేతులు దులుపుకున్నారే తప్ప, బీసీలకు న్యాయం జరగలేదన్నారు. గవర్నర్ ఆమోదం లేకుండా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేయడం సరైంది కాదన్నారు. రాజ్యాంగ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టేంతవరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మేమెంతో మాకు అంత వాటా నినాదంతో బీసీలు ముందుకు సాగాలని జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి, బీసీ మేధావుల ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు మాట్లాడుతూ, 42శాతం రిజర్వేషన్ల్లు చట్టబద్ధత పొందాలంటే 9వ షెడ్యూల్లో చేర్చడమే మార్గం అని సూచించారు.
జీవోలు, చట్టాలు కోర్టుల్లో నిలువవని ప్రభుత్వానికి కూడా తెలుసన్నారు. మార్చి 17న అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసి కేంద్రానికి పంపినా, ప్రభుత్వం తర్వాత జీవో నెంబర్ 9ను విడుదల చేసిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లి, ఒత్తిడి తెచ్చి 9వ షెడ్యూల్లో చర్చేలా చూడాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజు మాట్లాడుతూ, బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీలను పాలకవర్గాలు బిచ్చగాళ్లుగా చూస్తున్నారని, బీసీలకు రాజ్యాధికారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ద్వారానే విద్యా ఉద్యోగాల్లో న్యాయం జరుగుతుందన్నారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుందన్నారు.
రిజర్వేషన్ల న్యాయపోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధిష్ఠానం, రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ తీసుకున్న వాదానికి బీసీలు తోడు కలిసారని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు మాల మహానాడు సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రిజర్వేషన్ల సాధనకు బీసీలంతా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ న్యాయమైన రిజర్వేషన్ల కోసం బీసీలు అలుపెరుగని ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు సీపీఎం పక్షాన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మాజీ ఎంపీ వీ హనుమంతరావు మాట్లాడు తూ 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాల్సిందేనని అన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే సహించేదిలేదని ఆయ న హెచ్చరించారు.