25-10-2025 01:34:20 AM
క్రాంతి మల్లాడి :
బీసీ ఆత్మగౌరవ భవనాలెక్కడ?
నిర్మాణానికి బీఆర్‌ఎస్ హయాంలో బీజం
హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత బీసీల సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయాలన్న సంకల్పంతో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘బీసీ ఆత్మగౌరవ భవనాలు’ నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు ప్రత్యేక భవనం నిర్మించి.. వారు సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, సామాజిక చైతన్యానికి కేంద్రంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ఈ క్రమంలో 2018లో బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి బీజం పడింది. ముందు 112 బీసీ కులాలకు సంబంధించిన భవనాలను నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన చేసినప్పటికీ చివరికి 41 భవనాలు నిర్మించాలని ఖరారు చేసింది. కానీ ఆ భవనాల నిర్మాణం కేవలం శంకుస్థాపనలకు మాత్ర మే పరిమితమైంది. బీసీల ఆత్మగౌరవం కోసం నిర్మించాలనుకున్న ఆ భవనాలపై ప్రస్తుతం నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి.
బీసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాల్సిన ఈ భవనాలు, ప్రస్తుతం అసంపూర్ణంగా మిగిలిపోయాయి. తమకూ ప్రత్యేకంగా స్థలం, భవనం, ప్రత్యేకంగా గుర్తింపు వస్తుందని భావించిన బీసీల ఆశలు ఆదిలోనే చల్లారాయి. బీసీ ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలనుకు న్న స్థలాలు కానరావడం లేదు. ఆ భవనాల నిర్మాణ పనులు నిర్లక్ష్యానికి చిహ్నంగా నిలుస్తున్నాయి. దీంతో బీసీ వర్గాలు తీవ్ర ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నాయి.
సమస్యల సుడిగుండంలో..
బీసీ ఆత్మ గౌరవభవనాల నిర్మాణం మంచి ఉద్దేశంతో మొద లైనప్పటికీ ప్రభుత్వ ప్రయత్నానికి సమస్యలు చుట్టుముట్టాయి. ఆయా ప్రాంత్లాలో బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ మొదట భూసేకరణలోనే సమస్యలు తలెత్తాయి. చాలా ప్రాంతాల్లో సరైన ప్రభుత్వ భూమి అందుబాటు లో లేక, ప్రైవేట్ భూములను గుర్తించాల్సి వచ్చింది. ఆ ప్రక్రియలో స్థానిక రాజకీయ నాయకుల జోక్యం, పరిపాలనా జాప్యం, రిజిస్ట్రేష న్ సమస్యలు బీసీ భవనాల నిర్మాణాన్ని ప్రారంభంలోనే వెనక్కు నెట్టాయి.
అయితే అన్ని అడ్డంకులను దాటుకుని, నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని ఆయా ప్రాంతాల్లో సరైన స్థలాలను గుర్తించింది. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి కావాల్సిన నిధులను కూడా కేటాయించింది. ఆయా కులాల జనాభా ప్రాతినిధ్యం వారీగా బీసీ భవనాల నిర్మాణానికి కావల్సిన వేల కోట్ల విలువ చేసే స్థలాన్ని, నిధులను మంజూరుకు ఆమోదించింది. అందులో భాగంగా 41 భవనాల నిర్మాణం కోసం మొత్తంగా 87.3 ఎకరాల భూమిని, రూ. 95.2 కోట్ల నిధులను కేటాయించింది.
బీసీ భవనాల్లో ఉప్పల్ భగాయత్ ప్రాం తంలో 22 భవనాలకు, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, గిర్మాపూర్, బాట సింగారంలో ఒక్కొక ్కటి చొప్పున, కోకాపేట్‌లో 13 భవనాలను నిర్మించాలని నిర్ణయించి స్థలాలను గుర్తించింది. దీనికి 2023 సంవత్సరంలో ఆయా బీసీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కా ర్యక్రమాలను చేపట్టింది. కానీ నిర్మాణం మాత్రం ముందుకు సాగలేదు. ఆత్మగౌరవ భవనాలపై బీసీ ఆశలు ఆవిరై పోయాయి.
కురుమ భవన్ పూర్తునా..
బీఆర్‌ఎస్ హయాంలో కోకాపేటలో యాదవ, కురుమ భవన్ కు శంకుస్థాపన చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 డిసెంబర్‌లో దొడ్డి కొ మురయ్య కురుమ భవన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. మొ త్తం 41 బీసీ ఆత్మగౌరవ భవనాల్లో కేవలం యాదవ, కురుమ భవనం మాత్రమే పూర్తి అయింది. కానీ ఆ భవనంలో సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదనే ఆరోపనలున్నాయి. కురు మ భవన్‌ను వినియో గంలోకి తీసుకురావడంపై పరిపాలనా ఆసక్తి కనిపించలేదు.
విద్యుత్ కనెక్షన్‌లు మంజూరు కాలేదు, తాగునీటి సదుపాయం లేదు, ఫర్నిచర్, సిబ్బంది నియామకాలు జరగలేదు. ఫలితంగా కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలు వాడుకలోకి రాకుండా కాలగర్భంలో కలిసిపోతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ భవనం దెబ్బతింటోందని, గోడలకు చీలికలు కనిపిస్తున్నా య ని, అయినా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదని బీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల డబ్బుతో కట్టిన భవనాలు కేవలం ఫోటో సెషన్‌లకే పరిమితమయ్యాయని బీసీ సంఘాలు విమర్శిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం..
తెలంగాణలో బీసీ ఆత్మ గౌరవ భవనాల ప్రాజెక్ట్, బీసీ సమాజానికి గుర్తింపు, సామాజిక వేదికగా నిలిచేలా ఉండాలని ఉద్దేశ పూ ర్వకంగా మొదలైంది. కానీ బీసీ భవనాలు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి. బీఆర్‌ఎస్ హయాంలో శంకుస్థాపన పూర్తిఅయి నా వాటి నిర్మాణంలో అడుగుకూడా ముం దుకు పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ భవనాల నిర్మాణంపై నిర్లక్ష్యం చూపడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని బీసీలు ఆరోపిస్తున్నారు. బీసీ భవనాల నిర్మాణం కోసం అవసరమైన నిధులు సకాలంలో విడుదల చేయకపోవడ ం వల్ల అనేక భవనాలు నిర్మాణం ఆగిపోయింది.
నిర్మాణానికి కావాల్సిన భూమి కే టాయింపు, టెండర్ ప్రక్రియలు, అనుమతు లు ఆలస్యమవడం వల్ల ప్రాజెక్టు వేగం తగ్గిం ది. పూర్తయిన భవనానికి విద్యుత్, నీరు, ఫర్నిచర్ వంటి ప్రాథమిక సదుపాయాలు లేక వాడుకలోకి రాలేదు. బీసీ సంక్షేమానికి సంబంధించిన ప్రాజెక్టులు రాజకీయ ప్రాధాన్యత పొందకపోవడంతో ప్రాజెక్ట్ పటిష్టత తగ్గిందని బీసీలు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం భవనాల నిర్మాణ సమస్య కాదని, బీసీ సమాజం పట్ల ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంగా భావిస్తున్నారు.
మూలనపడ్డ నిర్మాణం..
బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి 2023 అసెంబ్లీ ఎన్నికలు బ్రేక్ వేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు 41 బీసీ భవనాలకు శంకుస్థాపనలు పూర్తి కాగా నిర్మాణం ప్రారంభమయ్యే దశలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పెద్దదెబ్బ పడినట్టు అయింది. ప్రభుత్వ మార్పు తర్వాత ఈ భవనాల నిర్మాణంపై ప్రాధానత్య తగ్గిందని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ భవనాలను పునఃసమీక్షిస్తామని చెప్పినప్పటికీ 22 నెలలు గడిచినా ఇప్పటికీ ఈ అంశంపై ఎలాంటి స్పష్టత రాలేదు.
రాష్ర్టంలో ప్రభుత్వం మారిన తర్వాత బీసీ ఆత్మగౌరవ భవనాల ప్రాజెక్టు దిశ మారిపోయింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ ప్రాజెక్టులలో చాలావరకు ఫైళ్లు మూలనపడిపోయాయి. వాటిలో బీసీ ఆత్మగౌరవ భవనాల ప్రాజెక్టు కూడా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ భవనాలు బీసీల గుర్తింపు చిహ్నంగా ప్రచారం జరిగింది. కానీ ప్రభుత్వం మారగానే బీసీ భవనాల నిర్మాణం మసకబారింది.
అయితే గత ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టులు అవినీతితో నిండిపోయిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ఆత్మగౌరవ భవనాలపై నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తుందని బీసీలు ప్రశ్నిస్తున్నారు. బీసీ సమాజానికి ప్రతీకగా నిలిచే భవనాలు పూర్తికాకపోతే బీసీల ఆత్మగౌరవం ఎక్కడ ఉంటుందని నిలదీస్తున్నారు.
శంకస్థాపనలకే పరిమితం చేసింది
ప్రభుత్వాలు బీసీలపై నిర్లక్ష్యం చూపుతున్నాయి. బీసీ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బీసీ భవనాలను వెంటనే పూర్తి చేయాలి. ఇప్పటికే బీసీ గురుకులాలకు, హాస్టళ్లకు సొంత భవనాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వం బీసీ భవనాల నిర్మాణంపై కూడా నిర్లక్ష్యం చూపుతున్నది. బీసీ భవనాల కోసం స్థలం, నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. శంకుస్థాపన చేసి వదిలేయడం కాకుండా, వెంటనే బడ్జెట్ విడుదల చేసి వాటిని పూర్తి చేయాలి.
ఆర్ కృష్ణయ్య, రాజ్యసభ సభ్యుడు
భవనాల నిర్మాణంపై ప్రభుత్వం నిర్లక్ష్యం
బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణాన్ని తక్షణమే, యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. కేవలం భూములు కేటాయించి నిర్మాణాన్ని విస్మరించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆత్మగౌరవ భవనాల నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో బీసీ భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవా? ప్రభుత్వం అనుకుంటే నిర్మాణం పెద్ద సమస్య కాదు. తక్షణమే బీసీ భవనాలకు నిధులు విడుదల చేయాలి. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయం తీసుకుని వెంటనే బీసీ భవనాలను పూర్తిచేయాలి.
జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
