25-10-2025 01:27:10 AM
19 మంది దుర్మరణం
నిద్రలోనే ..మృత్యుఒడికి
గద్వాల, అక్టోబర్ 24 (విజయక్రాంతి)/అలంపూర్: ఇద్దరు డ్రైవర్లతో సహా సుమారు 43 మందితో వేమూరి కావేరి ట్రావెల్ బస్సు (డీడీ 01 ఎన్ 9490) హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. గద్వా ల జిల్లా రాష్ట్ర సరిహద్దు ప్రాంతం పుల్లూరు చెక్‌పోస్ట్ వద్దకు అర్ధరాత్రి 2:40 గంటలకు బస్సు చేరుకున్నట్లు టోల్ ప్లాజా వద్ద ఏర్పా టు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. తర్వాత కర్నూల్ పట్టణానికి చేరుకొని అక్కడ డ్రైవర్ సహా కొంత మంది టీ తాగినట్లు తెలిసింది.
అక్కడి నుంచి బయలుదేరిన పది నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా కేంద్రం దాటిన తర్వాత కల్లూరు మండలం చిన్నటేకూరు ప్రాంతంలో నాయకల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రాం తానికి శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు చేరుకుంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. అదే సమయంలో కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన శివశంకర్ బైక్‌పై బస్సు ముందు నుంచి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడుపుతూ.. ముందు వెళ్తున్న బైకును ఢీకొట్టాడు. బైకర్‌తో పాటు బైకును బస్సు దాదాపు 300 మీటర్ల వరకు ఈడ్చికెళ్లింది. దీంతో బస్సు నుంచి ఇంధనం లీకై బస్సులో మం టలు ఎగసిపడ్డాయి. గాఢ నిద్రలో ఉన్న 19 మంది బస్సులోనే మంటల్లో చిక్కుకుని సజీ వ దహనమయ్యారు.
బైకర్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్ద శబ్దానికి కొం దరు ప్రయాణికులు నిద్ర నుంచి లేచి ఎమర్జెన్సీ డోర్ ద్వారా.. కిటికీల ద్వారా దాదాపు 22 మంది కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఇద్దరు డ్రైవర్లలో ప్రధాన డ్రైవర్ లక్ష్మయ్య(పల్నాడు జిల్లా) బస్సు దిగి పరారయ్యాడు. రెండో డ్రైవర్ శివనారాయణ (ప్ర కాశం జిలా) పోలీసుల అదుపులో ఉన్నాడు.
సెకండ్ల వ్యవధిలో బస్సు దగ్ధం
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై ప్రత్యక్షసాక్షులు, ప్రయాణికులు కీలక విషయాలు వెల్లడించారు. సెకన్ల వ్యవధిలోనే అంతా జరిగిపోయిందని చెప్పారు. కళ్లు మూసి తెరిచే లోపే భారీగా మంటలు వ్యాపించాయని, వెనకాల కూర్చున్న ఓ వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ బద్దలుకొట్టడం వల్ల దాని నుంచి బయట పడ్డామని కొందరు ప్రయాణికులు చెప్పారు.
సీఎం ఆదేశాలతో సహాయక చర్యలు
క్షతగాత్రులకు, మృతుల కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో అవసర మైన సహాయక చర్యలు చేపట్టినట్లు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తెలిపారు. ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ప్ర మాద ఘటన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించా రు. హైదరాబాదు నుంచి బెంగళూరు బయలుదేరిన కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్, క్లీనర్ ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు.
వైద్య సిబ్బంది బస్సులోని మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. క్షతగాత్రులు కర్నూలు ప్రభుత్వాసుపత్రి తో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రిలోనూ చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదికను బట్టి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పా రు. బస్సులో తెలంగాణ నుంచి 13 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 12 మంది, ఇతర రాష్ట్రాల నుంచి మిగతావారు ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం మేరకు తెలిసిందన్నారు.
హెల్ప్‌డెస్క్ నంబర్లు
* కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి: 9100901604.
* గద్వాల కలెక్టరేట్: 9502271122, 9100901599, 9100901598.
* గద్వాల పోలీస్ కార్యాలయం: 8712661828
బస్సును తొలగిస్తుండగా క్రేన్ బోల్తా
బస్సు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయం త్రం ప్రమాదానికి కారణమైన బస్సును రోడ్డు పైనుంచి తొలగిస్తుండగా క్రేన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్‌కు గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు క్రేన్ ఆపరేటర్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పాలెం ప్రమాదం రిపీట్
సరిగ్గా 12 సంవత్సరాల క్రితం అక్టోబర్ 30, 2013లో వనపర్తి జిల్లా కొత్తకోట మం డలం పాలెం జాతీయ రహదారిపై బెంగళూరు నుంచి 51 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ప్రమాదానికి గురై 45 మంది సజీవ దహనమయ్యారు. బస్సు ఓ కారును ఓవర్‌టేక్ చేస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. డీజిల్ ట్యాంక్ లీక్ అయి పేలుడు సంభవించడంతో 45 మంది దహనం అయ్యారు. కేవలం బస్సు డ్రైవరుతో పాటు క్లీనర్, ఐదుగురు ప్రయాణికులు బతికారు.
20 మంది మృతులు వీరే..
ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు తెలిసింది. మృతుల్లో ఏపీ, తెలంగాణ నుంచి ఆరుగురు చొప్పున, ఒడిశా, బిహార్ నుంచి ఒక్కొక్కరు, తమిళనాడు, కర్ణాటక నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. మరొకరి మృతదేహం గుర్తించాల్సి ఉంది. నెల్లూరు జిల్లా గొల్లవారిపల్లికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందారు మృతుల్లో జె ఫిలోమిన్ బేబీ (64), కిషోర్ (64), ప్రశాంత్ (32), ఆర్గా బందోపధ్యాయ (23), యువన్ శంకర్ రాజా (22), మేఘనాథ్ (25), ధాత్రి (27), అమృత్ కుమార్ (18), చందన మంగ (23), అనూష (22), గిరిరావు (48), కేనుగు దీపక్ కుమార్ (24), జి రమేష్, జి అనూష, మనీత, కేశనాథ్, సంధ్యారాణి, కర్రీ శ్రీనివాసరెడ్డి, పంచాల శివశంకర్ (ద్విచక్ర వాహనదారుడు) ఉన్నారు. ఒకరి పేరు తెలియాల్సి ఉంది.
గాయాలతో బయటపడిన నవీన్‌కుమార్
ఎల్బీనగర్: బస్సు ప్రమాదంలో హయత్ నగర్ డివిజన్ ఎల్లారెడ్డి కాలనీలో నివాసం ఉండే ఆందోజు కృష్ణమాచారి రెండో కుమారుడు నవీన్‌కుమార్ (26) తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం కర్నూలుకు బయలుదేరి వెళ్లారు. నవీన్ కుమార్ బెంగళూరులో విప్రోలో ఉద్యోగం చేస్తున్నాడు. దీపావళి పండుగ కోసం ఇంటికి వచ్చిన నవీన్ కుమార్ గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నాంపల్లిలో బస్సు ఎక్కాడు. బస్సులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన నవీన్ కుమార్ బస్సు అద్దాలను ధ్వంసం చేసుకుని కిందకు దూకాడు. ఈ క్రమంలో కాలు విరిగి.. ప్రాణాలతో బయటపడ్డాడు.
ఎల్బీనగర్‌లో బస్సు ఎక్కిన ఇద్దరి ఆచూకీ లేదు
నల్లగొండ జిల్లా కోదాడ మండలం శ్రీనివాసనగర్‌కు చెందిన చిట్టోజు మేఘన, అమృత్ కుమార్ అనే ఇద్దరు ఎల్బీనగర్‌లో బస్సు ఎక్కారు. అమృత్ కుమార్ (ఆచూకీ ఇంకా తెలియలేదు) ఫోన్ ముందు నుంచే పనిచేయడం లేదు. అయితే ప్రమాదంలో ఎల్బీనగర్‌కు చెందినవారు ఎవరూ లేరని ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి : రేవంత్‌రెడ్డి
బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో మాట్లాడి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. గద్వాల కలెక్టర్, ఎస్పీని ఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.
ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయం అందించే చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హెల్ప్‌లైన్ నెంబర్లు, సంప్రదించాల్సిన అధికారులను ప్రభుత్వం నియమించింది. ఎం రామచంద్ర, అసిస్టెంట్ కమిషనర్ - 991299545, చిట్టిబాబు, సెక్షన్ ఆఫీసర్ - 9440854433 నెంబర్లను ఫోన్ చేయాలని కోరారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు: మంత్రి జూపల్లి
బస్సు ప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ వ్యక్తుల కుటుంబాలకు బరూ.౫ లక్షలు, క్షతగాత్రులకు రూ.౨ లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. తెలంగాణకు చెందిన ఆరుగురు మృతి చెందారని, పదిమంది గాయాలతో బయటపడ్డారని చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. చెందిన ఈ ప్రమాదం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం తో జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి ప్ర మాదాలు చోటు చేసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు సుశిక్షకులైన డ్రైవర్లను నియమించుకునేలా, రవాణా శాఖ నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు.
సీటింగ్‌కు పర్మిషన్.. స్లీపింగ్‌గా మార్పు
ప్రమాదానికి గురైన బస్సులో సీటింగ్‌కు మాత్రమే అనుమతి ఉండగా.. యాజమాన్యం స్లీపింగ్‌గా మార్చినట్టు తేలింది. తెలంగాణకు చెందిన హెబ్రాన్ ఇన్‌ఫ్రా స్టక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. ఈ బస్సును 2018లో కొన్నది. 2023 తర్వాత వేమూరి వినోద్‌కుమార్ అమ్మింది. వారు కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ డామన్‌లో తిరిగి రిజిస్ట్రేషన్ చేశారు. డయ్యూ డామన్ ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్న కావేరి ట్రావెల్స్.. ఒడిశాలోని రాయగడలో ఆల్టేషన్, ఫిట్‌నెస్ చేయించుకున్నారు.
రాయగడ అధికారులు బస్సుకు 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ మాత్రమే ఇచ్చారు. కానీ కావేరి ట్రావెల్స్ సంస్థ స్లీపర్ క్యారియర్‌గా మార్చింది. డయ్యూ డామన్‌లో సీటింగ్ సామర్థ్యం ఉన్న బస్సు రవాణా పన్ను ఒక్క సీటుకు రూ.450, స్లీపర్ సీటు అయితే రూ.800 అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సీటుకు రూ.4,500 పన్ను చెల్లించాలి. స్లీపర్ సీటుకు రూ.12వేల ట్యాక్స్ చెల్లించాలి. పన్ను ఎగవేతకే అక్రమ రిజిస్ట్రేషన్ చేయించిందని సమాచారం. బస్సుపై 16 చలాన్లు ఉన్నాయి. రూ.23,120 ఫైన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
బాధ్యులపై కఠిన చర్యలు: ఏపీ సీఎం చంద్రబాబు
బస్సు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, పర్మిట్ వివరాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికా రులను ఆదేశించారు. అంతేకాకుం డా ఏపీలోని ప్రైవేటు బస్సుల ఫిట్‌నెస్, సేఫ్టీ, పర్మిట్ తనిఖీలు చేప ట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యం లో ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మం త్రులు, అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదే శించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరు గైన వైద్యం అందేలా చూడాలన్నారు.
కుటుంబాలను ఆదుకోవాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జర గకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలి. మృతుల కుటుంబాలకు ప్రభు త్వం అండగా నిలవాలి. క్షతగాత్రుల కు మెరుగైన చికిత్సను అందించాలి.
బస్సు ప్రమాదం కలచివేసింది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురి కావడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందారన్న వార్త కలచివేసింది. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నా.
బాధిత కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి : మాజీ సీఎం కేసీఆర్
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.
బస్సు ప్రమాదం దురదృష్టకరం : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం దురదృష్టకరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. స్థానిక అధికారులు అవసరమైన సహాయక చర్యలు వేగంగా చేపట్టాలి. క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలి. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి.
తల్లీకూతురు సజీవ దహనం
- -బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లా వాసుల మృతి
మెదక్(విజయక్రాంతి): కర్నూల్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో మెదక్ జిల్లా శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన తల్లీకూతురు సజీవ దహనమయ్యారు. మెదక్ మండలం శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన సుధారాణి(43), ఆనంద్‌గౌడ్ దంపతులు. ఆనంద్‌గౌడ్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడు. వారికి కూతురు చందన(23), వల్లభగౌడ్ ఉన్నారు. చందన బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటుంది.
కుమారుడు అలహాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. ఇటీవల పాపన్నపేటలో ఉన్న తన తల్లిదండ్రుల వద్దకు సుధారాణి తన భర్త, పిల్లలతో కలిసి వచ్చారు. రెండు రోజుల క్రితం ఆనంద్‌గౌడ్, కుమారుడు వల్లభగౌడ్ తిరిగి వెళ్లిపోగా.. సంధ్యారాణి తన కూతురు చందనను బెంగుళూరులో దింపేసి దుబాయ్ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం సాయంత్రం సంధ్యారాణి, చందన హైదరాబాద్ చింతల్‌లో కావేరీ ట్రావెల్ బస్సులో బెంగుళూరుకు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున బస్సు దగ్ధం కావడంతో ఇద్దరూ సజీవ దహనం అయ్యారు.
కూతురు వద్దకు వచ్చి అనంతలోకాలకు
- బస్సు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి
పటాన్‌చెరు, అక్టోబర్ 24: కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నుంచి వెళ్లిన తల్లీకొడుకు మృతిచెందారు. బెంగుళూరుకు చెందిన పిలోమి నాన్ బేబీ(64)కి కొడుకు కిషోర్ కుమార్ (41), కూతురు పద్మప్రియ ఉన్నారు. దీపావళి సందర్భం గా పటాన్‌చెరులోని కృషి డిఫెన్స్ కాలనీలోని 192 విల్లా లో నివాసం ఉంటున్న కూతురు పద్మప్రియ ఇంటికి పిలో మి నాన్ బేబీ, కిషోర్ కుమార్ వచ్చారు. గురువారం సాయంత్రం పటాన్‌చెరు అంబేద్కర్ చౌరస్తా వద్ద కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సులో బెంగుళూరు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారు జామున కర్నూలులో బస్సులో చెలరేగిన మంటలకు ఇద్దరూ ఆహుతయ్యారు. అలాగే అమీన్‌పూర్ మండలం బీరంగూడలో ఇదే బస్సు ఎక్కిన అశ్విన్‌రెడ్డి ఉప్పల్ ప్రాంతానికి చెందినవారుగా తెలిసింది.
ప్రాణాలతో బయటపడ్డ మియాపూర్ వాసి
- స్వల్ప గాయాలతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స
శేరిలింగంపల్లి(విజయక్రాంతి): బస్సు ప్రమాదంలో మియాపూర్‌కు చెందిన యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మియాపూర్ మక్త మహబూబ్‌పేట్‌లోని ప్రజా షెల్టర్ అపార్ట్‌మెంట్‌లో నివసించే జయసూర్య (23) ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం నెమలిదిమ్మె గ్రామానికి చెందిన జయసూర్య.. తల్లిదండ్రులు సుబ్బారాయుడు, రమాదేవిలతో కలిసి మియాపూర్‌లో ఉంటున్నాడు.
మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన జయసూర్య, బెంగళూరులో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఉందంటూ గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరాడు. మియాపూర్‌లో బస్సు మిస్సవడంతో మూసాపేట వద్ద బస్సు ఎక్కిన అతను, ప్రమాదం జరిగిన సమయంలో అదే బస్సులో ఉన్నాడు. బస్సులో మంటలు చెలరేగిన సమయంలో తేరుకుని కిటికీ నుంచి కిందకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. శుక్రవారం ఉదయం ఆరున్నర ప్రాంతంలో తల్లిదండ్రులకు కాల్ చేసి విషయం తెలిపాడు. కాగా బస్సు నుంచి కిందకు దూకడంతో రెండు కాళ్లకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
యాదాద్రి జిల్లా వస్తకుండూరులో విషాదం
- సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనూష దుర్మరణం
యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరుకు చెందిన మహేశ్వరం అనూషరెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నది. దీపావళి పండుగకు ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో ఆనందంగా గడిపింది. గురువారం సాయంత్రం బెంగళూరుకు వెళ్లడానికి బయలుదేరగా ఆమె తండ్రి మోత్కూరు బస్టాండ్‌కు బైక్‌పై తీసుకెళ్లి డ్రాప్ చేశాడు.
ఆమె అక్కడి నుంచి హైదరాబాదుకు చేరుకుని గురువారం రాత్రి బెంగళూరు బస్సు ఎక్కింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు కర్నూల్ జిల్లాలో బైక్‌ను ఢీకొనడంతో చెలరేగిన మంటల్లో అనూషరెడ్డి దుర్మరణం చెందింది.ప్రాంతంలో తల్లిదండ్రులకు కాల్ చేసి విషయం తెలిపాడు. కాగా బస్సు నుంచి కిందకు దూకడంతో రెండు కాళ్లకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.