11 April, 2026 | 4:13 AM

పోలింగ్‌కు నిజామాబాద్ రెడీ

13-05-2024 01:54 AM

అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

సెగ్మెంట్‌లో ఆరు డీఆర్‌సీల నుంచి సామగ్రి తరలింపు

నిజామాబాద్, మే 12(విజయక్రాంతి): నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 17,04,867 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సెగ్మెంట్‌లో మొత్తం ఆరు డీఆర్‌సీలను ఏర్పాటు చేశారు. వీటి నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల సామగ్రిని తరలించారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బాల్కొండ, బోధన్, డిచ్‌పల్లిలోని సీఎంసీ సెంటర్ల నుంచి ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. డిచ్‌పల్లి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను నిజామాబాద్ రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హన్మంతు, నిజామాబాద్ పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ సింఘెనవార్ పరిశీలించారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందువల్ల పోలింగ్ కోసం రెండు చొప్పున బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నారు. అందువల్ల నియోజకవర్గం పరిధిలో 4,497 బ్యాలెట్ యూనిట్లు, 2,293 కంట్రోల్ యూనిట్లు, 2,511 వీవీ ప్యాట్లను వినియోగించనున్నారు. ఎన్నికల విధుల నిర్వహణ కోసం 302 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 184 మంది రూట్ ఆఫీసర్లు పనిచేయనున్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ప్రధాన పార్టీల తరఫున ధర్మపురి అరవింద్ (బీజేపీ), తాటిపర్తి జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), బాజిరెడ్డి గోవర్ధన్ (బీఆర్‌ఎస్)తో పాటు పుప్పాల లింబాద్రి(బీఎస్పీ), అబ్బగోని అశోక్ గౌడ్(బహుజన లెఫ్ట్ పార్టీ) తదితరులు పోటీలో ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరధిలో పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లను కట్టుదిట్టమైన భద్రత మధ్య సీఎంసీ కళాశాలలోని స్ట్రాంగ్ రూంకు తరలించారు. రిటర్నింగ్ ఆఫీసర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పర్యవేక్షణలో సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలీస్ వజర్, పోటీ చేస్తున్న అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లు భద్రపరిచిన స్టాంగ్ రూంకు సీల్ వేశారు.