రెపోరేట్లలో మార్పుల్లేవ్!
5.25 % వద్దే కొనసాగింపు
వృద్ధిరేటు 6.9 శాతం, రిటైల్ ద్రవ్యోల్బణం 4.6 %: ఆర్బీఐ
ముంబై, ఏప్రిల్ 8 : వడ్డీరేట్లలో (రెపోరేటు) ఎలాంటి మార్పు లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తామని ఆర్బీఐ గవర్నర్ సం జయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. బుధవారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) నిర్ణయాలను మ ల్హోత్రా మీడియాతో పంచుకున్నా రు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనూహ్యా సవాళ్లు ఎదురవుతున్నాయని, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు వృద్ధికి ఆటంకాలను కలిగిస్తున్నాయన్నారు.
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.9 శాతంగా, రెండో త్రైమాసికం లో 6.8 శాతం, మూడో త్రైమాసికంలో 6.7 శాతం నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశంఉందని, రిటైల్ ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చని తెలిపారు. ప్రపంచ అనిశ్చితుల నడుమ ద్రవ్యోల్బణం నియంత్రణతోపాటు ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడాన్ని సమతుల్యం చేయడమే ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశం లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు.
అధిక సామర్థ్య వినియోగస్థాయిల మద్దతుతో ప్రైవేట్ రంగ పెట్టుబడులు మెరుగుపడతాయని అంచనా వేస్తున్నట్లు, అదే సమయంలో ఆహార ధరల సమీప భవిష్యత్ అంచనాలు సౌకర్యవంతంగా ఉన్నాయన్నారు. ఏప్రిల్ 3 నాటికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 697.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఎఫ్డీఐలు మెరుగుపడ్డాయని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా స్పష్టం చేశారు.




