19-05-2024 12:49:31 AM
కాంగ్రెస్‌లో చేరినా దక్కని చైర్మన్‌గిరి
అవిశ్వాసానికి హాజరైన 9 మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు
చైర్మన్ పదవిని కోల్పోయిన కుడుముల సత్యనారాయణ
కామారెడ్డి, మే 18 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై బిఆర్‌ఎస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. బీఆర్‌ఎస్‌కు చెందిన 9 మంది కౌన్సిలర్లు సత్యనారాయణకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో సత్యనారాయణ చైర్మన్ పదవి కోల్పోయారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 మంది కౌన్సిలర్లకు ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లు కాగా, బిఆర్‌ఎస్‌కు చెందిన 9 మంది కౌన్సిలర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. గతంలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 మంది కౌన్సిలర్లు బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కుడుముల సత్యనారాయణను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అధికారం కోల్పోవడంతో పాటు స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గెలుపొందారు. బిఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు సత్యనారాయణ నమ్మినబంటుగా ఉండి కాంగ్రెస్‌లో చేరడంతో బిఆర్‌ఎస్ కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో సత్యనారాయణపై అవిశ్వాసం ప్రవేశపెట్టారు.
ఈ విషయంలో కోర్టులో కేసు వేసిన సత్యనారాయణకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. దీంతో శనివారం ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. 9 మంది బిఆర్‌ఎస్ కౌన్సిలర్లు వ్యతిరేకంగా చేతులెత్తారు. మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై ఆవిశ్వాసం కోసం క్యాంపు రాజకీయాలు నిర్వహించారు. చైర్మన్ పదవిని ఆశిస్తున్న పదవ వార్డు కౌన్సిలర్ బిఆర్‌ఎస్ తరపున గెలిచిన పద్మ శ్రీకాంత్ క్యాంపుకు కౌన్సిలర్లను తరలించి, ఆవిశ్వాసం నెగ్గెలా వ్యవహరించారు. పద్మ శ్రీకాంత్‌ను త్వరలోనే మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నుకుం టామని బిఆర్‌ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండగా బిఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఏకతాటిపై ఉండి, కాంగ్రెస్ పార్టీలో చేరిన కుడుముల సత్యనారాయణపై వ్యతిరేకంగా ఓటు వేసి పదవి నుంచి తొలగించడం సంచలనానికి తెరతీసింది. పార్టీ మారినా సత్యనారాయణ తన పదవిని కాపాడులేకపోవడం గమనార్హం.