11-12-2025 01:57:29 AM
కాకతీయ యూనివర్సిటీ, డిసెంబర్ 10(విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో స్టూడెంట్ అఫైర్స్ డీన్ ఆధ్వర్యంలో డీన్ ఆచార్య మామిడాల ఇస్తారి అధ్యక్షతన నిర్వహించిన రెండు రోజుల నోబెల్ ప్రైజ్ డే సంబరాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమం ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల అకాడమిక్ స్పిరిట్ ఎంతో గొప్పదన్నారు.
ప్రతి ఆవిష్కరణ, సృజన మానవ అభివృద్ధికి దారితీయాలని, విద్యార్థుల జిజ్ఞాసను బహిర్గతం చేయడం ద్వారా ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనవచ్చన్నారు. విద్యార్థుల మేధస్సే పవర్ ఆఫ్ ఐడియాస్ కు పునాది అని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం గోల్డెన్ జూబిలీ సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు.
కార్యక్రమ నిర్వహణలో అధ్యాపకుల కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారీ మాట్లాడుతూ మొత్తం 11 విభాగాల నుండి 300 పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని, నోబెల్ ప్రైజ్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడానికి విద్యార్థులతోనే కమిటీ వేసి వారే నిర్వహించేలా చేశామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంపస్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య టి. మనోహర్, ఫార్మసీ విభాగ డీన్ ఆచార్య గాదె సమ్మయ్య, శాతవాహన యూనివర్సిటీ పూర్వ వైస్చాన్సలర్ ఆచార్య మహమ్మద్ ఇక్బాల్ అలీ, వరంగల్ ఎన్‌ఐటీకి చెందిన ఆచార్య రాజ విశ్వనాధం, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్లు డాక్టర్ నిరంజన్, డాక్టర్ టి. రాధిక, పలు విభాగాల అధిపతులు, బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.