11-12-2025 01:31:49 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 10 (విజయక్రాంతి) : హైదరాబాద్ శివార్లలో రియల్ ఎస్టేట్ బూమ్‌ను ఆసరాగా చేసుకుని, సామాన్యుల కష్టార్జితాన్ని దోచుకుంటున్న ఘరానా సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉక్కు పాదం మోపింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రావడాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించి, ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో రూ. 70 కోట్ల మేర మోసానికి పాల్పడిన భువన తేజ రియల్ ఎస్టేట్స్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లి మిటెడ్ సంస్థపై ఈడీ అధికారులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు.
ఆశ చూపి.. నిండా ముంచారు..
ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కానుండటంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. ఇదే అదనుగా భావించిన భువన తేజ సంస్థ డైరెక్టర్లు.. తక్కువ ధరకే ప్లాట్లు, విల్లాలు, ఫ్లాట్లు ఇస్తామంటూ ప్రజలను నమ్మించారు. మార్కెట్ ధర కంటే సగం రేటుకే ఇస్తామంటూ ఆశచూపారు. అనుమతులు రాకముందే ప్రీలాంచ్ పేరుతో అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. ఇలా సుమారు రూ. 70 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
డబ్బులు కట్టించుకున్న తర్వాత ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా, ప్రాజెక్టు పనులు మొదలుపెట్టకుండా సంస్థ యజమానులు కాలయాపన చేశారు. నెలలు గడుస్తున్నా ఆస్తులు చేతికి రాకపోవడంతో బాధితులు ఆందోళన చెందారు. డబ్బులు వెనక్కి అడిగితే బెదిరింపులకు దిగడంతో బాధితులు గతంలోనే హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సీసీఎస్ పోలీసులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.
ప్రజల నుంచి వసూలు చేసిన రూ. 70 కోట్లను సంస్థ డైరెక్టర్లు దారి మళ్లించినట్లు గుర్తించారు. ఆ డబ్బుతో బినామీ ఆస్తులు కొనుగోలు చేశారా? విదేశాలకు తరలించారా? అనే కోణంలో మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచే ఈడీ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నగరంలోని భువన తేజ రియల్ ఎస్టేట్స్ ప్రధాన కార్యాలయంతో పాటు, సంస్థ డైరెక్టర్లు, వారి బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ తనిఖీల్లో కీలకమైన డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు, బ్యాంకు లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనుమతులు లేని ప్రాజెక్టుల్లో, ప్రీలాంచ్ ఆఫర్లలో పెట్టుబడులు పెట్టొద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. హెచ్‌ఎండీఏ, రెరా అనుమతులు ఉన్న వెంచర్లలో మాత్రమే ప్లాట్లు కొనాలని సూచిస్తున్నారు.