11-12-2025 01:50:10 AM
ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ స్థాయికి తీసుకెళ్తా..
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 10 (విజయక్రాంతి) : తెలంగాణలో ఉద్యమాలకు ఊపిరిపోసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి తనదైన ముద్ర వేశారు. బుధవారం ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ వేదికగా జరిగిన ‘సర్వం సిద్ధం’ సభలో ఆయన పాల్గొన్నారు. 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన డిసెంబర్ మాసంలోనే.. ఎలాంటి పోలీసు ఆంక్షలు, బారికేడ్లు లేకుం డా విద్యార్థుల మధ్యకు వస్తానని గతంలో ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఓయూను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతానని, ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలకు దీటుగా మారుస్తానని సీఎం ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి క్యాంపస్‌లో అడుగుపెట్టిన రేవంత్‌రెడ్డి.. దశాబ్దాలుగా నిధుల లేమితో కనారిల్లుతున్న ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా భారీ వరాలు ప్రకటించారు. వర్సిటీ సమగ్ర అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు కేటాయిస్తూ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీచేశారు.
అనంతరం ఓయూ క్యాంపస్‌లో పర్యటించిన ఆయన.. ఆర్ట్స్ కాలేజీ వద్ద నిర్వహించిన సభలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రం వేరు వేరు కాదు.. అవిభక్త కవలలు. 1969 ఉద్యమం నుంచి మలిదశ పోరాటం వరకు ఈ గడ్డ అందించిన చైతన్యం అమోఘం. ఓయూ అంటే తెలంగాణకు గుండెకాయ వంటిది. మీరే ఈ సమాజానికి దిక్సూచి’ అని విద్యార్థులను కొనియాడారు.
గత పదేళ్లలో అప్పటి ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఇటువైపు చూడలేదని, పదేళ్లల్లో ఓయూ ఘనచరిత్ర మసకబారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానంటే.. గతంలో రాజకీయ నాయకులను అక్కడ అడ్డుకున్నారని, ఎందుకంత ధైర్యం చేస్తున్నావని నన్ను కొంతమంది అడిగారు. కానీ, ఉద్యమ గడ్డ ఓయూకు రావడానికి కావాల్సింది ధైర్యం కాదు.. గుండెనిండా అభిమానం.
ఆ అభిమానంతోనే.. ఈ వర్సిటీని ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చా’ అని స్పష్టం చేశా రు. తన విద్యాభ్యాసంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం వేదికపై నుంచి గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడని కొందరు ఎద్దేవా చేస్తున్నా రు. అవును.. నేను సర్కారు బడిలోనే చదివా. నేనేం గుంటూరులో చదువుకోలేదు.
నాకు గూడుపుఠానీలు తెలియవు. గుంటూరు, పుణె, అమెరికాలో చదివిన వాళ్ళు బెంజ్ కార్లలో ఎక్స్‌కర్షన్‌లా వెళ్లి పేదరికం గురించి తెలుసుకుంటారు. నాకు విదేశీ భాష ఇంగ్లీష్ రాకపో వచ్చు.. కానీ పేదవాడి మనసు చదవడం వచ్చు. ఇంగ్లీష్ అనేది కేవలం కమ్యూనికేషన్ మాత్రమే.. అది నాలెడ్జ్ కాదు’ అని సీఎం తేల్చిచెప్పారు. తెలుగు మీడియంలో చదివినంత మాత్రాన ఆత్మన్యూనతకు గురికావొద్దని అన్నా రు. ‘చేతనైతే ఆర్ట్స్ కాలేజీకి రమ్మని ఒకాయన గతంలో సవాల్ విసిరాడు.
నాకేం ఫామ్ హౌలు లేవు. నేనేం ప్రజల సొమ్ము దోచుకోలేదు. వందల ఎకరాల్లో ఫామ్ హౌస్‌లు కట్టుకున్నోళ్లు.. పదేళ్లలో దళితులకు కనీసం మూడు ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు’ అని ప్రశ్నించారు. పదేళ్లుగా ఉస్మానియాను నిర్వీర్యం చేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల ఆశీర్వాదంతోనే తాను ఈ స్థానంలో ఉన్నానని తెలిపారు. తమ ప్రభుత్వం రెండేళ్లలో ఏం చేసిందని ప్రశ్నిస్తున్న వారికి సీఎం గట్టి సమాధానం ఇచ్చారు.
‘బహుజన రూపుతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాం. ఎస్సీ వర్గీకరణ, కులగణన చేప ట్టి సామాజిక న్యాయం చేశాం. యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటుచేశాం’ అని వివరించారు. విద్యార్థులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా, వారి జెండాలు మోయకుండా స్వతం త్రంగా ఎదగాలని సీఎం విద్యార్థులకు సూచించారు. ‘నిరంతరం కష్టపడండి.. డాక్టర్లు, లాయ ర్లు, ఐఏఎస్‌లుగా రాణించండి. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులుగా ఎదగండి’ అని ఆకాంక్షించారు.
వర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి కమిటీ వేశామని, 15 రోజుల్లో ప్రక్రియ మొదలవుతుందని, ఇందులో ఎలాంటి పొలిటికల్ ఆబ్లిగేషన్, పైరవీలు ఉండదని స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రణాళికలు కేవలం అధికారుల గదుల్లోనే కాకుండా.. విద్యార్థుల భాగస్వామ్యం తో జరగాలని సీఎం ఆకాంక్షించారు. ఇందుకోసండ్రాప్ బాక్సులు, ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా విద్యార్థుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. నెలఖా రులోగా తుది ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
మౌలిక వసతులతో పాటు విద్యా ప్రమాణాలపైనా దృష్టి సారించాలని సీఎం సూచించారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు, ఏఐ ల్యాబ్స్, అం తర్జాతీయ వర్సిటీలతో ఒప్పందాలు చేసుకోవాలని, తద్వారా ఓయూ ర్యాంకింగ్స్‌ను మెరుగు పరచాలని దిశానిర్దేశం చేశారు. ఓయూ పునరుజ్జీవనమే తెలంగాణ పునరుజ్జీవనం అని సీఎం చేసిన వ్యాఖ్యలు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఒకప్పుడు ఉద్యమకారులుగా ఉన్న విద్యార్థులే.. ఇప్పుడు నవనిర్మాతలుగా మారాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఆధునిక ఓయూ..
రూ. వెయ్యి కోట్లతో ఓయూ ముఖచిత్రం మారనుంది. హాస్టళ్ల ఆధునీకరణ, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునిక రీడింగ్ రూమ్స్ ఏర్పాటు. క్యాంపస్‌లో మౌలిక సదుపాయాల కల్పన. క్యాంపస్‌లో సైకిల్ ట్రాక్లు, వాకింగ్ పాత్‌లు, అర్బన్ ఫారెస్ట్రీ, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అదనపు సామర్థ్యంతో కొత్త అకడమిక్ బ్లాకులు, హాస్టళ్ల నిర్మాణం, ఆర్ట్స్ కాలేజీ వంటి వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తూనే.. ప్రాధాన్యత లేని పాత భవనాల స్థానంలో ఆధునిక నిర్మాణాలు రానున్నాయి. వచ్చే 24 నెలల్లోనే ఈ పనులన్నీ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
రూ.వెయ్యి కోట్లతో ఓయూకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు తొలి అడుగు పడింది. ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దాలన్నీ నెరవేరుతాయని, ఇందుకు మరిన్ని నిధులు మంజూరవుతాయని ప్రతిఒక్కరు ఆశిస్తున్నారు. ౧౯౧౮లో ౭వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పూనికతో ఏర్పడిన ఓయూ, అప్పుడు దేశంలోనే ౭వ యూనివర్సిటీగా వెలుగొందింది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ౪౫లక్షల రూపాయల చెక్కును వర్సిటీ పూర్వవిద్యార్థులు అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ పర్యటనలో ఓయూ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఫ్రొపెసర్ కుమార్, పూర్వ విద్యార్థులతో అభివృద్ధి పనులపై చర్చించారు.
విద్యను ప్రేమిస్తున్న సీఎం..
ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి రికార్డు సృష్టించారని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం చెప్పారు. ముఖ్యమంత్రి విద్యను ప్రేమిస్తున్నారని ఆయన అన్నారు. ‘1965లో అప్ప టి ప్రధాని ఇందిరా గాంధీ ఆర్ట్స్ కాలేజీ మె ట్లు ఎక్కారు. ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఎక్కిన మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నిలిచారు’ అని కొనియాడారు. రేవం త్‌రెడ్డి 25 ఏళ్ల క్రితం గీతమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, ఇప్పుడు ఆయన విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారని చమత్కరించారు. ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలల్లోనే రూ. 1,000 కోట్లతో జీవో తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు.