calender_icon.png 29 August, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ మున్సిపల్ పరిధిలో నాన్ రెసిడెన్స్ ఓట్లను తొలగించాలి

29-08-2025 08:46:08 PM

ఇతర రాష్ట్రాల వాళ్లు రెండు మూడు చోట్ల ఓట్లు కలిగి ఉన్నారు

బోగస్ ఓట్ల ఏరివేతకు ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు చేపట్టాలి

ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ విజ్ఞప్తి

కరీంనగర్,(విజయక్రాంతి): ఎన్నికల కమిషన్ రూపొందించిన ఎన్నికల జాబితాలో జనాలు తక్కువగా, ఓటర్లు ఎక్కువగా ఉన్నారని ఇది ఎవరిలోపమని ఓటరు జాబితాలో ఉన్న లోపాలను గుర్తించి తక్షణమే సరిదిద్దాలని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు, జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితాపై,  పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పై నిర్వహించిన వివిధ రాజకీయ పార్టీల సమీక్ష సమావేశానికి ఎంఐఎం పార్టీ పక్షాన గులాం అహ్మద్, బర్కత్ అలీ కలిసి హాజరయ్యారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చనిపోయిన వారి ఓట్లను తొలగించాలని, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వచ్చిన వారి ఓట్లను గుర్తించి, దేశంలో ఒకే చోట ఒక ఎన్నికకు ఒకేసారి ఓటు వేసేలా అవకాశం కల్పించాలన్నారు. ఎన్నికల కమిషన్ కు తద్వారా బోగస్ ఓట్ల ఏరివేత సాధ్యమవుతుందన్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో ఓటు వేస్తూ.. వారి సొంత రాష్ట్రాల్లో అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ సైతం ఓట్లు వేస్తున్నారని, ఇలాంటి డబుల్ ఓటింగ్ విధానం జరగకుండా నిరోధించాలన్నారు.

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల జాబితాలో సుమారు 40వేల ఓట్లు గ్రామపంచాయతీల్లో నివసిస్తున్న వారి ఓట్లు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారి ఓట్లు కలిగి ఉన్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని డివిజన్లో ఎంతమంది ఉన్నారు. ఎన్ని ఓట్లు ఎక్కువగా ఉన్నాయి వాటిని జల్లెడ పట్టి బిఎల్వోలు గుర్తించేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. గ్రామ, డివిజన్ స్థాయి స్థానికులతో విచారణ జరిపి లేదా వివిధ పార్టీల నాయకులు లేదా కుల సంఘాల ప్రతినిధుల సహాయంతో వివరాలు తెలుసుకొని చనిపోయిన వారి ఓట్లను తొలగించాలన్నారు.

బ్రతికి ఉన్న వారి ఓట్లు గల్లంత కాకుండా ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, అర్హత కలిగిన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని చెప్పారు ఒక డివిజన్ పరిధిలోని ఒక ఇంటిలో వారి ఓట్లను ఒకే పోలింగ్ కేంద్రంలో పరిధిలో ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలని, రెండు కేంద్రాల్లో ఓట్లు ఉండడంతో ఓటు వేసే బాధ్యత తగ్గి పోలింగ్ శాతం తగ్గడానికి కూడా కారణమవుతుందన్నారు.