calender_icon.png 1 July, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తరాది అతలాకుతలం

01-07-2025 12:18:57 AM

  1. హిమాచల్ ప్రదేశ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు
  2. -  24 గంటల్లో హిమాచల్‌లో ముగ్గురి మృతి
  3. హిమాచల్‌లో పోటెత్తిన వరద.. 10 జిల్లాలకు వరద హెచ్చరికలు
  4. -  8 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ 
  5. చార్‌ధామ్ యాత్ర పునఃప్రారంభం

న్యూఢిల్లీ, జూన్ 30: ఉత్తర భారతదేశాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తర, ఈశాన్య భారతంలో భారీ వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వానల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హిమాచల్ ప్రదే శ్, ఉత్తరా ఖండ్‌ను వర్షాలు కుదిపేస్తున్నాయి. భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని 10 జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది.

భారీ వర్షాలకు శిమ్లాలో ఐదంతస్థుల భవనం కుప్పకూలింది. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భవనం నుంచి ప్రజలను ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పినట్టయింది. సమీపంలోని మరి న్ని భవనాలకు కూడా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాచల్‌లో గత 24 గంటల్లో భారీ వర్షాలకు  ముగ్గురు మృతి చెందారు.

రాష్ట్ర వ్యాప్తంగా 129 రహదారులు మూతపడగా.. మండీ, సిర్మౌర్ జిల్లాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సోలన్‌లో ఒక వంతెన కొట్టుకుపోయింది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచి రాష్ట్రంలో 20 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.

ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈశాన్య రాష్ట్రాల్లో జూలై 2 నుంచి 5 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. 

పంజాబ్, హర్యానాలోనూ..

పంజాబ్, హర్యానాలోనూ వానలు దంచికొడుతున్నాయి. గత 24 గంటల్లో ఛండీగర్‌లో 70.5 మిమీ టర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్‌లోని లుధియానా, పటియాలా, పఠాన్‌కోట్, బతిండా, మొహలీ, గురుదా స్‌పూర్‌లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి.

ఇక హర్యానాలోని య మునానగర్, హిసర్, అంబాలా రోహ్‌తక్, భివానీ, సి స్సా, పంచకుల ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వా నలు దంచికొట్టాయి. ఒడిశాలో భారీ వర్షాలతో వరద పోటెత్తుతుంది. బాలేశ్వర్, మయూర్బంజ్ జిల్లాలో సువర్ణ రేఖ, జలక, బుదాబిలంగా నదులు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి.

ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి..

నిలిచిపోయిన చార్‌ధామ్ యాత్ర సోమవారం పునఃప్రారంభమైంది. 24 గంటల నిషేధాన్ని ఎత్తేసినట్టు అధికారులు ప్రకటించారు.  ఇక ఉత్తర్‌కాశీ జిల్లాలో కుంభవృష్టితో యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయ్ బైండ్ లో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కుప్పకూలింది. ఈ సంఘటనలో ఇద్దరు భవన కార్మికులు మృతి చెందగా.. ఏడుగురు గల్లంతయ్యారు. యమునోత్రి రహదారికి మరమ్మత్తులు చేపట్టినట్టు తెలిపారు.