calender_icon.png 21 September, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తింపులేని 10 పార్టీలకు నోటీసులు

21-09-2025 12:59:50 AM

-అక్టోబర్ 10 లోపు వివరణ ఇవ్వాలి

-రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

- ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల అధికారి  

హైదరాబాద్, సెప్టెంబర్ 20, (విజయక్రాంతి): రాష్ర్టంలో నమోదైన 10 గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు తెలంగాణ రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వాటి కార్యకలాపాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, అక్టోబర్ 10లోపు సమాధానం ఇవ్వకపోతే గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉందని శనివారం జారీ చేసిన ఒక ప్రకటనలో ఆయన హెచ్చరించారు. సెప్టెంబర్ 19న ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను నోటీసులు అందజేయాలని, జాతీయ, స్థానిక పత్రికల్లో ప్రచురణతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు నిర్దిష్ట ఫార్మాట్‌లో సవివరమైన నివేదికలు తయారు చేసి, ఈ పార్టీలు కొనసాగించాలా లేదా?, గుర్తింపు రద్దు చేయాలా అన్న దానిపై స్పష్టమైన సిఫారసులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ నివేదికలు తప్పనిసరిగా ఈఏడాది అక్టోబర్ 10లోపు సమర్పించాలని, ఆ తర్వాత ఎన్నికల సంఘానికి పంపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు

నోటీసులు అందుకున్న పార్టీలు ఇవి.. 

బహుజన రాష్ర్టమ్ సమితి (హైదరాబాద్), ఇండియన్ రక్షక నాయకుడు పార్టీ (నారాయణపేట), జై మహా భారత్ పార్టీ (జోగులాంబ గద్వాల్), జై స్వరాజ్ పార్టీ (రంగారెడ్డి), మజ్లిస్ మార్కజ్ పార్టీ (హైదరాబాద్), నవ ప్రజా రాజ్యం పార్టీ (ఆదిలాబాద్), న్యూ ఇండియా పార్టీ (పెద్దపల్లి), ప్రజా స్వరాజ్ పార్టీ (రంగారెడ్డి), శ్రమజీవి పార్టీ (మేడ్చల్-మల్కాజిగిరి), తెలంగాణ ఇంటి పార్టీ (నల్గొండ) ఉన్నాయి.