17-02-2026 12:56:57 AM
కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగనవాడి అధికారులతో సమీక్ష సమావేశం
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 16, (విజయక్రాంతి) : ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ అభియాన్ పథకం అద్భుతమైందని, ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ జాయిన్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందుగల సమావేశ మందిరంలో మహిళా, శిశు, వయోవృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారిని జె. స్వర్ణలత లెనీనా ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రతి ఒక్క అంగనవాడి కేంద్రం తెరవాలని, తెరిచిన వెంటనే టీచర్, హెల్పర్, లబ్ధిదారుల హాజరు కేంద్ర రాష్ట్ర స్థాయి అప్లికేషన్లు అయినటువంటి పోషణ ట్రాకర్, న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టంలో నమోదు చేయాలని తెలిపారు. వైద్యశాఖ సమన్వయంతో అతి తీవ్ర పోషణ లోపం, పోషణ లోపం, తక్కువ బరువుతో ఉన్న పిల్లలను ప్రత్యేకంగా పర్యవేక్షించి వైద్యుల సూచనల మేరకు న్యూట్రిషన్ రీహబిటేషన్ సెంటర్కి పంపించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలన్నారు.
ప్రతినెల క్రమం తప్పకుండా అత్యాధునిక సాంకేతిక పరికారాలతో పిల్లల ఎత్తు, బరువులు చూసి సరైన సమయంలో సరైన పోషణ అందించాలని కోరారు. కిశోర బాలికల కోసం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు క్రింద ‘ఇందిరమ్మ అమృతం‘ పేరుతో 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల ఆడపిల్లలకు మిల్లెట్స్ తో కూడిన చిక్కిలు నెల నెల అందజేయడం జరుగుతుందని తద్వారా రక్తహీనత లోపం లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడమే మన లక్ష్యం అన్నారు,
నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పౌష్టికాహార పంపిణీలో జాప్యం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఎవరైనా గుత్తేదారులు పంపిణీ విషయంలో కానీ నాణ్యత విషయంలో గానీ అలసత్వం ప్రదర్శిస్తే బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. పూర్వ ప్రాథమిక విద్య, పౌష్టికాహార విలువలపై టీచర్లకు అవగాహన కల్పిస్తూ, పోషణ అభియాన్ పథకంలో భాగంగా తల్లుల కమిటీ, గ్రామస్తులు, గ్రామ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో సామూహిక వేడుకలు అయినటువంటి అక్షరాభ్యాసం, అన్నప్రాసన, శ్రీమంతాలు నిర్వహిస్తూ వారిలో మరింత అవగాహన కల్పించాలని తెలిపారు.
రాష్ట్రంలోని ఎక్కడ లేని విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తనదైన శైలిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శాశ్వతంగా అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించేందుకు గాను పెరటి తోట పెంపకాలు (న్యూట్రి గార్డెన్స్) నిర్మించారని దీనిని ఆదర్శంగా తీసుకొని వివిధ జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని జే. స్వర్ణలత లెనీనా, జిల్లా సిడిపివోలు ప్రసన్న లక్ష్మి, జయలక్ష్మి, తార, అరుణ కుమారి, పద్మశ్రీ, చైతన్య, సలోమి, హేమ సత్య, జ్యోతి, జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ పొనుగోటి సంపత్, జిల్లా కార్యాలయ సిబ్బంది హసీనా, భార్గవి, డి. సి .పి .ఓ హరికుమారి, చైల్ లైన్ సందీప్, జిల్లా పోషణ అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.