11-03-2025 07:32:38 PM
మునుగోడు/నాంపల్లి (విజయక్రాంతి): మండలంలోని చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలకు మంజూరైన అమ్మ ఆదర్శ పాఠశాల నిధులు దుర్వినియోగం అయినాయని అందిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాంపల్లి ప్రత్యేక అధికారి శ్రీనివాస్ మంగళవారం చిట్టెంపహాడ్ పాఠశాలలో విచారణ చేపట్టారు. పాఠశాలకు మైనర్ మరమ్మతులు, మూత్రశాలల నిర్మాణం, మంచినీటి సదుపాయం కోసం, ఎలక్ట్రిసిటీ పనుల కోసం ఆరు లక్షల 50 వేల రూపాయలు అమ్మ ఆదర్శ పాఠశాల నిధులు మంజూరు కావడం జరిగింది. పాఠశాలకు చేయవలసిన ఎలక్ట్రిసిటీ పనులు చేయలేదని, మంచినీటి వసతి కల్పించవలసి ఉండగా పాత ట్యాంకుకు నల్ల కనెక్షన్లు ఇచ్చినట్లు, మోటర్ బిగించకుండా ఇటీవలనే ఎలాంటి కరెంట్ కనెక్షన్, పైప్ లైన్ కనెక్షన్ లేకుండా వాటర్ ట్యాంకులో ఒక పాత మోటర్ వేసి ఉంచినట్లు ప్రత్యేక అధికారి గుర్తించారు.
మూత్రశాలలు నిర్మించవలసి ఉండగా నిర్మించకుండానే సగం పనులు చేసి పనులు పూర్తయినట్లుగా రిపోర్టు ఇవ్వటం ఏమిటని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అంటే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉంటారు కేవలం చైర్మన్, హెచ్ఎం తీర్మానం మేరకే నిధులు ఎలా డ్రా చేస్తారని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఎంబి నమోదు చేసిన పనులపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి నిజనిర్ధారణ చేయాలని, పాఠశాలకు ప్రహరీ నిర్మాణం చేయాలని, మూత్రశాలల నిర్మాణం చేపట్టాలని ప్రజలు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి మేరి స్వర్ణకుమారి, మండల పంచాయతీ అధికారి ఝాన్సీ, పంచాయతీ కార్యదర్శి శివ కుమార్, మండల పరిషత్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్, బుషిపాక ఏడుకొండలు, గిరి స్వామి, బచ్చనబోయిన శ్రీశైలం, పందుల బిక్షం, అబ్బనబోయిన సైదులు, బుషిపాక నరేష్, కృష్ణ ఉగ్గపల్లి శ్రీను, వజ్జ వెంకట్ రెడ్డి, నరసింహ, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.