25-08-2025 12:02:55 AM
- అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం
-12 ఏళ్లుగా 100 మంది అన్నదాతల ఇక్కట్లు
- కలెక్టర్ ఆదేశించినా పట్టించుకోని అధికారులు
కామారెడ్డి, ఆగస్టు 24 (విజయ క్రాంతి): గత ప్రభుత్వం ధరణి కార్యక్రమాన్ని తేవడం ఆ రైతుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. ధరణి లో 100 మంది రైతుల భూములు నమోదు కాలేదు. అటవీ, రెవిన్యూ శాఖల అధికారుల సమన్వయ లోపం రైతుల పాలిట శాపం గా మారింది. గ్రామానికి వచ్చిన అధికారులతో పాటు, జిల్లా కేంద్రంలో ఉన్న అధికారులకు, ప్రజాప్రతినిధుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన ఆ రైతుల సమస్య మాత్రం నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. గత ప్రభుత్వ హాయంలో రైతులకు ఇచ్చిన రైతుబంధు, ఇన్సూరెన్స్, వంటి పథకాలకు రైతులు దూరమయ్యారు.
ప్రస్తుత ప్రభుత్వం భూభారతి తెచ్చిన సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో మల్లూరు గ్రామానికి చెందిన 100 మంది రైతుల గోడు ఇది. ఇప్పటికైనా రెవిన్యూ అటవీశాఖ అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే. మల్లూరు గ్రామంలో 765 సర్వే నెంబర్లు 707.32 ఎకరాల భూమి ఉంది. రెవిన్యూ శాఖకు చెందిన భూమి 2004 30 ఎకరాలు కాగా అటవీ శాఖకు చెందిన 467.02 ఎకరాల భూమి ప్రభుత్వ గెజిట్ ప్రకారం కేటాయించి ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమందికి పట్టాలు కూడా ఇచ్చారు. అప్పట్లో రైతులు ప్రభుత్వ పథకాలు పొందారు.
బ్యాంకు రుణాలు పొందారు. అంతవరకు బాగానే ఉన్నా గత ప్రభుత్వాలయంలో ధరణి పథకాన్ని తీసుకురావడంతో ఈ రైతుల పాలిట శాపంగా మారింది. రెవిన్యూ, అటవీశాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం రైతుల పాలిట శాపం మారింది. రైతులు ఎన్నిసార్లు కలెక్టర్కు, ఆర్డిఓకు, తా హసిల్దారులకు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా ఉంది. రైతుల సమస్య మాత్రం నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు.
అటవీశాఖ, రెవిన్యూ శాఖల మధ్య భూమికి సంబంధించిన సరైన నక్ష లేకపోవడమే వల్లనే అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలుస్తుంది. తమ సమస్య పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో ప్రభుత్వ పథకాలు తమకు ఎప్పుడు వర్తిస్తాయోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవిన్యూ, అటవీశాఖ అధికారులు 100 మంది రైతుల ప్రయోజనాన్ని గుర్తించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అంటే విశాఖ అధికారులు మేలుకుంటారా లేక అదే కాలయాపన చేస్తా రో చూడాల్సిందే.
100 మంది రైతుల సమస్య
పరిష్కారానికి కృషి చేస్తా
మల్లూరు రైతుల భూ సమస్యపై బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయిని విజయ క్రాంతి ప్రతినిధి వివరణ కోరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రైతుల సమస్య క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి అటవీశాఖ, రెవెన్యూ అధికారుల జాయింట్ సర్వే చేయించి రైతులకు ప్రయోజనం చేస్తామని ఆమె తెలిపారు.
కిరణ్మయి, జాయింట్ కలెక్టర్, బాన్సువాడ, కామారెడ్డి జిల్లా