27-06-2025 12:26:07 AM
రికగ్నయిజేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా నిర్లక్ష్యం
గజ్వేల్, జూన్ 26: ప్రభుత్వ పాఠశాలల అక్రమాలకు జిల్లా, మండల విద్యాధికారులు అండగా నిలుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజుల వసూళ్ల గురించి మండల విద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రికగ్నైజేషన్ కోసం ఆయా పాఠశాలను ఇచ్చిన నివేదికలో వెల్లడించిన దానికంటే తరగతుల వారిగా ఎక్కువ ఫీజులు, ఇతర వసూలు చేసిన ఆయా పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని నిబంధన ఉన్నా మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారి ఈ విషయాన్ని పరిశీలించకపోవడం గమనార్హం.
రికగ్నైజేషన్ నిబంధన ప్రకారం ఆయా ప్రైవేటు పాఠశాలలు ప్రతి సంవత్సరం ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అకౌంట్ బుక్స్ ను డి ఈ ఓ, ఎంఈఓకు సమర్థించాల్సి ఉన్నా ఏ ఒక్క పాఠశాల కూడా తమ లావాదేవీలకు సంబంధించిన వివరాలను జిల్లా విద్యాధికారికి గాని, మండల విద్యాధికారికి గాని అందజేయడం లేదు. స్వచ్ఛంద సంస్థల పేరిట రిజిస్టర్ చేసుకుని విద్యను వ్యాపారంగా మార్చి లావాదేవీలను కొనసాగిస్తున్న ప్రైవేటు పాఠశాల అక్రమాలు వర్ణానాతీతం. అధికారుల అండతోనే ఆయా ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయ న్నది అక్షరసత్యం. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, విద్యాధికారుల తీరులో మార్పు వస్తే కానీ ఈ పరిస్థితులు మారే అవకాశం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫీజులు కట్టలేనివారు ప్రభుత్వ పాఠశాలల్లో చేరవచ్చుగా : ఎంఈఓల సలహా
అధిక ఫీజుల వసూళ్ల పై చర్యలు తీసుకోరా అని గజ్వేల్, కొండపాక మండలాల ఎంఈఓ లను ప్రశ్నించగా ప్రైవేటు పాఠశాలలో ఫీజులు కట్టలేని వారు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సలహాలు ఇచ్చారు. కానీ ప్రైవేటు పాఠశాలలను నియంత్రిస్తామని చెప్పకపోవడం గమనార్హం.
జగదేవ్పూర్ మండల విద్యాధికారి ఈ విషయంపై ప్రశ్నించగా ఫీజుల నియంత్రణ తమ పరిధిలో లేదని వెల్లడించారంటే రికగ్నైజేషన్ నిబంధనల గురించి కూడా అధికారులకు తెలియ కుండానే ప్రభుత్వ గుర్తింపు, ఆమోదిత పత్రాలనును ఆయా ప్రైవేటు పాఠశాలలకు ఇస్తున్నట్లు తేటతెల్లమవుతుంది. ములుగు ఎంఈఓ ను ప్రశ్నించగా ములుగు పరిధిలోని పాఠశాలలో రికగ్నైజేషన్ పత్రాలలో సమర్పించిన నివేదిక ప్రకార మే ప్రైవేటు పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తున్నాయని వెల్లడించారు. ఈ విషయంలో ఒక విద్యార్థి తల్లిదండ్రులతో మాత్రమే మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు.