27-06-2025 12:24:29 AM
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో డ్రగ్స్ నిరోధక ర్యాలీలు
పాల్గొన్న కలెక్టర్లు, ఎస్పీలు
సంగారెడ్డి/ మెదక్, జూన్ 26(విజయక్రాంతి): విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నవ సమాజానికి నాంది పలకాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయని, మాదకద్రవ్యాల వాడకం , అమ్మకాల వ్యాప్తిని నిరోధించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేం దుకు సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల వాడకం, అమ్మకం పూర్తిగా లేకుండా చేయడం కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీ కలెక్టరేట్ నుండి సంగారెడ్డి ఐ బి వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ సంజీవ్ రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు లలిత కుమారి, డీఈవో వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలో...
డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హితవు పలికారు. గురువారం జిల్లా సంక్షేమ శాఖ, పోలీస్, మాదకద్రవ్యాల నిర్మూలన శాఖ సమన్వయంతో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ , సీనియర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమా, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్‌అండ్ బి ఈఈ సర్దార్ సింగ్, జిల్లా సంక్షేమ అధికారి హైమావతి, మెదక్ డిఎస్పి ప్రసన్న కుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హుస్సేన్, మెదక్ తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులుతో కలిసి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్స్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే నష్టాలు, కుటుంబంలో మన తల్లిదండ్రులు, మన కుటుంబీకులు పొందే దుఃఖం అధికంగా ఉంటుందని, చెడు అలవాట్లకు మొదటి నుంచి దూరంగా ఉండాలని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి మనమందరం పనిచేయాలని, డ్రగ్స్ నియంత్రణలో పోలీసు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు, పాఠశాల స్థాయి నుంచే డ్రగ్స్ పై అవగాహన పొందాలని తద్వారా డ్రగ్ రహిత సమాజాన్ని చూడగలుగుతామన్నారు.