calender_icon.png 9 December, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓ(నో)ట్ల పండుగ!

09-12-2025 12:55:04 AM

  1. చలిలో వేడెక్కుతున్న రాజకీయాలు

అభ్యర్థుల్లో ఆందోళన ప్రలోభాల పర్వం

ఓటుకు నోటు, చుక్క, ముక్క లక్ష్యం కోసం.. లక్షల్లో ఖర్చులు

నకిరేకల్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): చలికాలంలో గ్రామపంచాయతీ ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓటర్ల పండుగ వచ్చిందంటే చాలు, అభ్యర్థులకు ఓటర్లంటే ఎక్కడ లేని ప్రేమ మొదలవుతుంది. అభివృద్ధి చేస్తాం, ఆదరించండి అంటూ ప్రతి అభ్యర్థి ప్రతి ఇంటి తలుపులు తట్టుతూ చేరుకుంటున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలు.

స్థానిక సమస్యలను పరిష్కరించడం, నిజాయితీతో కూడిన అభివృద్ధి, ప్రజలకు సమర్థమైన పాలన ఇవి సర్పంచ్ పదవికి అసలు విధులు. కానీ, ఈ గ్రామపంచాయతీ ఎన్నికల్లో దృశ్యం ప్రజాస్వామ్య విలువలకు మయమైన మచ్చగా మారుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.  నెలకు పది వేలు రాని సర్పంచ్ పదవి కోసం అభ్యర్థులు లక్షల రూపాయల ఖర్చు పెట్టి నిలబడుతున్నారు.

పదవి వ్యాపారం మాయమై పోయింది, ఓటరు సంతలోసరుకైపోయాడు. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు మకాం వేసి గ్రామాల వారీగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తమ పార్టీ తరఫున ఒక్కరే బరిలో ఉండేలా కార్యకర్తలు, ముఖ్యనేతలను సమన్వయ పరుస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలు వేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. తమ బలపరిచిన అభ్యర్థులు గెలిచేలా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రజల్లో బలమైన వ్యక్తిగా భావిస్తే చాలు, పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువా కప్పేస్తున్నారు.

ఓటర్లకు నోట్ల ఏరా..! ఉదయం ప్రచారాలు, సాయంత్రం ‘పంపిణీ’ 

సర్పంచ్ కుర్చీ కోసం అభ్యర్థులు ఓటర్లకు నోట్లు, సుక్క, ముక్క ఏరా వేస్తున్నారు. ఉదయం పూట ప్రచారం నిర్వహిస్తూ రాత్రి వేళల్లో  ఊరు బయట తోటల్లో కార్యకర్తలకు దావతులు నిర్వహిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఎవరిని కదిలించిన  ప్రలోభాల మాట. ఎన్నికల నియమావళికి విరుద్ధమైన నగదు పంపిణీపై నిఘా ఉన్నప్పటికీ, ఓటర్లకు నగదు పంపిణీని అడ్డుకోలేకపోతోంది.

పోలింగ్ కు మూడు రోజులే సమయం ఉండటంతో, ఇప్పటికే వివిధ గ్రామాల్లో  ఉపాధి కోసం  ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లను అభ్యర్థులు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్లు చేసి మాట్లాడటం, నివసిస్తున్న ప్రాంతానికి వెళ్లి మర్యాదలతో ఓటర్లను గెలిపించాలని  వేడుకోవడం . రవాణా ఖర్చులకు,ఓటుకు కలిపి  వెయ్యి నుండి 2000 రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వబడ్డట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఒక రౌండ్ సుక్క, ముక్క పంపిణీ జరిగిందని జోరుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలింగ్ ముందు రోజు లోకల్ గా ఉన్న ఓటర్లకు ఓటుకు నోటు 500   నుంచి 1000 వరకు , సుక్క, ముక్క పంపిణీ చేస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క గ్రామంలో అన్ని పార్టీలు కలసి సుమారు 4050 లక్షల రూపాయల ఖర్చు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

వార్డ్ మెంబర్ ఖర్చులతో కలిపి  ఒక సర్పంచ్ సుమారు 2025 లక్షలు  పైగా ఖర్చు చేస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రచార రథాలు, కార్యకర్తల నిర్వహణ, భారీ విందులు, ‘ఓటుకు నోటు’, ‘చుక్క-ముక్క’ పంపిణీకి లక్షల్లో ధనం వెచ్చిస్తున్నారు. నీతి, నిజాయితీ, సేవా భావనకు కొలమానం కాకుండా, డబ్బుతో గెలిచే క్రీడగా మారింది. ఉదయం ప్రసంగాలు, సాయంత్రం కళ్లు బైర్లు కమ్మే పంపిణీ. ఓటు హక్కును అమ్ముడుపోయే వస్తువుగా మార్చడం సాధారణం అయిపోయింది. నోరుతో చెప్పినవాడు కన్నా చేతికి ఇచ్చినవాడు ఎక్కువ పని చేస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

పేదవాడికి దారులు మూత 

లక్షల్లో ఖర్చులు చూసి నిజాయితీ, సేవాభావం కలిగిన పేద అభ్యర్థులు ముందుకు రాలేని పరిస్థితి.పైసలు ఉన్నోడికి పదవులు, పేదవాడికి అందని ద్రాక్ష లాగా మారింది. పదవిలోకి రాగానే పెట్టుబడిని తిరిగి రాబట్టే ప్రయత్నాలుమొదలవుతాయిగ్రామాభివృద్ధి పనులు పక్కనపడి, కాంట్రాక్టులు, కమిషన్లు, వ్యక్తిగత లాభాలకు ప్రాధాన్యత. ఫలితంగా, ఐదేళ్లపాటు గ్రామాలు సమస్యల మురికిగుంటలో ఉండిపోతాయి.

ఓటే వజ్రా ఆయుధం 

ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిన ‘ఓట్లనోట్ల పండుగ’ను అడ్డగలిగే శక్తి సామాన్య ఓటరు మాత్రమే. ఒక నిర్ణయం గ్రామం యొక్క ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది.ఓటు కేవలం వ్యక్తిని ఎన్నుకునే సాధనం కాదు, గ్రామాభివృద్ధిని నిర్ణయించే ఆయుధం. ప్రలోభాలకు, చుక్క-ముక్క, నోటు, వాగ్దానాలకు మోస పోకూడదు. అభ్యర్థిలో నిజాయితీ, గ్రామాభివృద్ధి పట్ల నిబద్ధత, అంకితభావం కలిగిన వారిని ఎంచుకోవాలి.

ఓటు చాలా విలువైనది, డబ్బు విలువైనది కాదు. ప్రలోభాలకు లొంగకుండా, వివేకంతో ఓటు వేయడం మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది. ఈ ‘నోట్ల మంట’ నుంచి బయటపడితేనే గ్రామ స్వరాజ్యం సిద్ధమవుతుంది. లేకపోతే ఐదేళ్లపాటు సమస్యలు, నిర్లక్ష్యం, అభివృద్ధి లోటు గ్రామంపై మోకలెక్కుతాయి.