29-10-2024 01:25:20 AM
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, ఆక్టోబర్ 28 (విజయక్రాంతి): భవిష్యత్తు ఆయిల్ పాం సాగు చేసే రైతులదేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మూడు రోజుల మలేషియా పర్యటన తర్వాత సోమవారం ఆయన ఖమ్మం చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాకు మలేషియాలో ఆయిల్ సాగుపై చేసిన అధ్యయనం గురించి వివరించారు.
అక్కడ సాగు విధానం తనను అబ్బురపరిచిందన్నారు. తాను స్వయంగా సాగు విధానం, ప్రాసెసింగ్ మిల్స్, సాగుకు వినియోగిస్తున్న సాంకేతికతను పరిశీలించానన్నారు. మొదటి రోజు మలేషియా ప్లాంటేషన్ వాణిజ్య, ఇండస్ట్రీస్ మంత్రి డాటో సిరి జోహారి అబ్దుల్ ఘనితో సమావేశయ్యానన్నారు. ఆ దేశంలో 5.70 మిలియన్ హెక్టార్లలో ఆయిల్ పాం ప్లాంటేషన్లు ఉన్నాయని మంత్రి తెలిపారన్నారు.
తర్వాతి రెండు రోజులు ఆయిల్ పాం బోర్డు ఆఫ్ డైరెక్టర్ జనరల్‌తో భేటీ అయ్యానన్నారు. కౌలాలంపూర్‌లో వ్యవసాయ పరికరాల ఎగ్జిబిషన్‌ను సందర్శించానన్నారు. ఫెడరల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ యంత్రాంగం ద్వారా ఆయిల్‌పాం సాగు మెళకువలు తెలుసుకున్నానన్నారు.
పనుల నాణ్యతలో రాజీ పడొద్దు
సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన ఖమ్మంలోని 19వ డివిజన్ ఏకలవ్యనగర్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. రోడ్డు లెవలింగ్ సరిగ్గా ఉండాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీవో గణేశ్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.