calender_icon.png 25 September, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓజీకి హైకోర్టులో చుక్కెదురు

25-09-2025 01:20:02 AM

-టికెట్ ధరల పెంపును సస్పెండ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్

-పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ ఆదేశాలు

హైదరాబాద్: పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ సినిమాకు హైకోర్టులో చుక్కెదురైంది. సినిమా టికెట్ ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్త ర్వులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముం దుకు రానుంది. బుధవారం రాత్రి నుంచి ప్రీమియర్‌లు ప్రదర్శించడంతో పాటు టికెట్ ధరల పెపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

ఓజీ విడుదల నేపథ్యంలో టికెట్ ధరలను పెంచాలని  చిత్ర నిర్మాణ సంస్థ ప్రభుత్వాన్ని కోరగా  అందుకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మెమోను సవాల్ చేస్తూ మహేశ్‌యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. టికెట్ల ధర పెంపునకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ సీఎస్‌కు ఎలాంటి అధికారాలు లేవని..  హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనర్, జిల్లాల పరిధిలో అదనపు కలెక్టర్‌కు మాత్రమే మెమో జారీ చేసే అధికారం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

టికెట్లు అధిక ధరకు విక్రయించకూడదని నిబంధనలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘గేమ్ ఛేంజర్’ సందర్భంగా హోంశాఖ అండర్ టేకింగ్ కూడా ఇచ్చిందన్న అంశాన్ని వివరించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ జారీ చేసిన మెమోను సస్పెండ్ చేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేశారు.