25-09-2025 01:16:26 AM
కరీంనగర్, సెప్టెంబరు 24 (విజయక్రాంతి): గత ప్రభుత్వ పాలనలో శిథిలావస్థకు చేరిన మహిళ ప్రాంగణాలు ప్రస్తుతం మహిళలకు స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ ఇస్తూ కళకళలాడుతున్నాయని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు.
బుధవారం కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండి కాలనీలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా, శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో బ్యూటీషియన్, టైలరింగ్, జ్యూట్ బ్యాగ్, ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానంతోపాటు పోషణ మాస ఉత్సవం, బతుకమ్మ ఉత్సవాలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని అన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రానున్న సీజన్లో ఎరువుల సరఫరా మహిళా సంఘాల ద్వారానే చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర మహిళా కోపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, కలెక్టర్ పమేలా సత్పతి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పాల్గొన్నారు.