15-10-2025 12:26:00 AM
-నాయకుల పయనమెటు..?
-పారాచూట్ నేతలతో పరేషాన్
మానకొండూరు, అక్టోబర్ 14 (విజయక్రాంతి) ః ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లతో మానకొండూరు మండలంలోని కాంగ్రెసు నాయకులకు అంది వచ్చిన అవకాశాలు హైకోర్టు స్టే తొ అడియాసలయ్యాయి. రిజర్వేషన్లు జాబితా వెలువడిన తర్వాత మండల కాంగ్రెస్ లో జరిగిన పరిణామాలు, అనూహ్య మలుపులు మండలంలో హాట్ టాపిక్ గా మారాయి. ఏ ఇద్దరి నాయకుల కలిసినా వారి మధ్య ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమైంది.
పార్టీ అధికారం రాకముందు నుండి జెండా మోసి మెడలో కండువా కలిగిన నాయకులకు ప్యారాచూట్ నేతలతో చుక్కెదురైంది. మానకొండూరు మండలంలోని ఇద్దరు సీనియర్ బీసీ నేతలకు అంది వచ్చిన అవకాశాన్ని దక్కకుండా ప్యారాచూట్ నేతలు పన్నిన రాజకీయ వ్యూహానికి కుదేలయ్యారు. మండలంలో జడ్పిటిసి, ఎంపీపీ స్థానాలు జనరల్ మహిళా కు కేటాయించారు. మండల కాంగ్రెస్ లొ కీలక బాధ్యత కలిగిన ఇద్దరు బీసీ నేతలకు జంపు జలానీలు, వర్గ రాజకీయ చతురతకు బలయ్యారు.
ఇద్దరు బీసీ నాయకుల్లో ఒకరు జడ్పిటిసి మరొకరు ఎంపీపీగా రిజర్వేషన్లు అనుకూలించటంతో కిందిస్థాయి నుండి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ముందుకు వెళుతున్న సమయంలో ఒక సామాజిక వర్గానికి చెందిన జంపు జలానీలు అల్లిన వలలో చిక్కుకొని అసహనానికి, అసంతృప్తికి లోనై కీలక నేతకు దూరమయ్యారు. ఇద్దరు బీసీ నేతలకు ఎంపీపీ, జడ్పిటిసి గా టికెట్లు దాదాపుగా ఖరారయ్యాయనే ప్రచా రం జోరుగా జరిగింది. ఓ బీసీ నేతకు తన సొంత గ్రామంలోనే అడ్డుకట్ట వేయటానికి ఆ సామాజిక వర్గానికి చెందిన మాజీ నాయకుని తెరపైకి తెచ్చి రాజకీయం రక్తి కట్టించారు.
దీంతో బీసీ నేత కంగుతిన్నారు . పారాచూట్ నేతలు ఈ ఇద్దరు నేతలకు టికెట్లు రాకుండా ఒక సామాజిక వర్గానికి కుల సమీకరణ తొ ,ఏకగ్రీవ తీర్మానం తీసుకొని జెడ్పిటిసి, ఎంపీపీ పదవులకు ఎన్నికల వ్యయం ఎక్కువ అవుతుందని, అంత భరించే శక్తి ఆ ఇద్దరి నాయకులకు లేదని, తద్వారా అభ్యర్థి ఓడిపోతే పార్టీకి నష్టం జరుగుతుందని, మాకు అవకాశం ఇస్తే ఈ రెండు సీట్లు కైవసం చేసుకుని మండలంలో పట్టు నిరూపించుకోవచ్చునని కీలక నేత కు ప్రతిపాదన చేశారు. కీలక నేత సైతం ఇందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.
తీరా సమయం దగ్గర పడుతున్న సమయంలో జంపు జలానీల వర్గానికి చెందిన అభ్యర్థి వ్యక్తిగత కారణాలతో ఎన్నికల బరిలో నిలువ లేనని తేల్చి చెప్పారు. దీంతో కంగు తిన్న కీలక నేత విధి లేని పరిస్థితులలో ప్రత్యామ్నాయం లేక బీసీ నేతలకు పోటీకి సిద్ధం కండి అని సమాచారం అందించారని తెలిసింది. ముందు సై అని తర్వాత నై అని పార్టీలో పని చేసిన మమ్మల్ని కాదని, చివరి నిమిషంలో మాకు మొండి చెయ్యి చూపారని మనస్థాపం చెంది బరిలో నిలవడానికి వెనుకడుగు వేశారు. ఎట్టకేలకు హైకోర్టు స్టే తో ఎన్నికల ప్రక్రియ నిలుపుదల తో ఈ సమస్యకు తాత్కాలికంగా తెరపడిన, నాయకుల అంతర్గత కుమ్ములాటలు, ఒక వర్గం ఎత్తుగడలు ఈ ఉదంతంతో బహిర్గతమయ్యాయి. నాయకుల విభేదాలు కుయుక్తులు, అసంతృప్తి రాబోయే ఎన్నికల్లో కీలక నేతకు తలనొప్పిగా మారనున్నాయి.