calender_icon.png 13 September, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాతకాలం పోకడలు

14-08-2024 12:30:00 AM

సింగరేణి బొగ్గు సంస్థలో ప్రధాన పాత్ర  నిర్వహిస్తున్న రెండు విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉంటారు. వారి లో ఒకరు అండర్ గ్రౌండ్ బొగ్గు ఉత్పత్తికి తోడ్పడేవారు అయితే, మరొకరు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపే వెన్నెముక లాంటి మినిస్ట్రీయల్ ఉద్యోగులు. వీరి దినచర్యలు ప్రతి ఉదయం మ్యాన్ వే (ఉద్యోగుల వాడుక భాషలో మైన్ బై) మ్యాగజిన్ విధుల నిర్వహణతో మొదలవుతుంది. అత్యవసర విధులు నిర్వహించే ఉద్యోగు లకు వర్ష శీత వేసవి కాలాలలో ధరించే దుస్తుల సదుపాయాలు యాజమాన్యం కల్పించడం లేదు. 

ఎటువంటి పరిస్థితుల్లోనైనా విధులు నిర్వహించాలి. ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపడానికి అధికారులు డ్రాఫ్టింగ్ ఇవ్వక పోవడంతో సిబ్బందే నిర్వహిస్తుంటారు. అనేక కార్యాలయాలు ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా పునర్నిర్మాణం కాలేదు. టైప్ రైటర్ వ్యవస్థ నుండి కంప్యూటర్స్‌లో ఎమ్మెస్ ఆఫీస్‌లో వినియోగాన్ని స్వంతంగా శిక్షణ పొంది కార్యకలాపాలు   కొనసాగిస్తున్నారు. ఇంతేగాక, సంస్థలో ప్రవేశపెట్టిన శాప్ (ఎస్‌ఏపీ) ప్రోగ్రాం దిగ్విజయంగా ఆచరించడంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. శాప్ ప్రోగ్రాం సింగరేణికి ముకుటాయంగా విలసిల్లుతున్నది. కొన్ని విభాగాలలో తప్ప చాలా మైన్స్ డిపార్ట్‌మెంట్స్‌లో కంప్యూటర్లకు అనుగుణంగా టేబుల్స్, కుర్చీలు సమకూర్చక పోవడం వల్లకూడా సిబ్బంది పురాతన కాలం నాటి కుర్చీలు, టేబుల్స్, ఇనుప స్టూల్స్ వాడుతున్నారు.

అవసరాలకు అనుగుణంగా సిబ్బంది నియామకం జరగకపోవడంతో రెండు, మూడు టేబుల్స్ విధులను ఒక్కరే నిర్వహించవలసి వస్తున్నది. ఫలితంగా వారిపై ఒత్తిడి అధికమవుతున్నది. అధునాతనమైన ఫైల్ రాక్స్ కొన్ని కార్యాలయాల లోనే దర్శనమిస్తుంటాయి. ఎన్నో కార్యాలయాలలో గోడల కు ఇనుప సజ్జలు, ఇతరేతర ఏర్పాట్లు చేసుకొని ఫైల్స్, డాక్యుమెంట్స్‌ను భద్రపరుస్తున్నారు. అతి ముఖ్యమైన క్వార్టర్స్  పర్సనల్, న్యాయ, ఎస్టేట్ విభాగాలకు చెందిన  డాక్యుమెంట్స్ రోజువారీగా ఉపయోగించడానికి, భద్రపరచడానికి కూడా పురాతనమైన గోడ గూళ్ళు, ఇనుప పెట్టెలు, అల్మారాలు ఇప్పటికీ ఉపయోగిస్తూ నే ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

వివిధ కార్యాలయాలలో పాత రికార్డులను భద్రపరచటానికి రికార్డు అసిస్టెంట్స్‌ను ఏర్పాటు చేయకపోవడం వల్ల ఫైల్స్ డాక్యుమెంట్స్ ప్రస్తుత భవిష్యత్ అవసరాల కోసం  సమకూర్చుకోవడంలో అనేక ఇబ్బందు లు ఎదురవుతున్నాయి. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సింగరేణిలోని అన్ని విభాగాలలో ఉపయోగించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సింగరేణి యావత్తు కంప్యూటర్ సహాయంతోనే నడుస్తున్నది, కానీ మనుగడకు సేవలు అందించే వెన్నెముక లాంటి మినిస్ట్రియల్ సిబ్బందికి అనుకూలమైన ఆధునాతన సౌకర్యాల కొరత తీవ్రంగా కనిపిస్తున్నది.

 దండంరాజు రాంచందర్ రావు