calender_icon.png 13 September, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుద్ధి బద్ధకించకూడదు

14-08-2024 12:30:00 AM

రాజా నముత్తిష్ఠమాన 

మనూత్తిష్ఠంతే భృత్యాః 

ప్రమాద్యన్త మనుప్రమాద్యన్తి 

కర్మాణిచాన్య భక్షయంతి 

ద్విషద్భిశ్చాతినంధీయతే 

తస్మాదుత్థాన మాత్మానః కుర్వీత 

 అర్థశాస్త్రం: 1-19-15

“వ్యక్తి జీవితం భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మికత అనే నాలుగు పార్శ్వాలలో నడుస్తుంది. ఈ నాలుగు పార్శ్వాలలోనూ రాజు లేదా నాయకుడు ఉత్సాహవంతుడై ముందుండి నడిపిస్తే, అతనిని అనుసరించి ఉద్యోగులూ ఉత్సాహంగా పని చేస్తారు. రాజు ప్రమ త్తుడైతే లేదా బద్ధకస్తుడైతే ఉద్యోగులూ బద్ధకస్థులై కర్తవ్యాలపట్ల విముఖులై ఉంటారు. రాచకార్యాలన్నీ అన్యులచేత భక్షింపబడతా యి. శత్రువులు లేదా పోటీదారులు ఆ నాయకుని మోసం చేస్తారు. నెమ్మదిగా ఆ నాయకుని ఆక్రమించేస్తారు” అంటాడు ఆచార్య చాణక్య. 

ఒక దేశాన్ని లేదా సంస్థను సమగ్రమైన అభ్యుదయ మార్గంలో నడ పడంలో నాయకుని పాత్ర చాలా కీలకమైంది. తన అనుయాయుల కు సంపూర్ణ సహకారాన్ని అందిం చి, వారిని సమున్నత లక్ష్యాల సాధనవైపు నడిపించడంలో ముఖ్య భూమిక వహించే నాయకుడు సర్వకాల సర్వావస్థలలోనూ అప్రమ త్తుడై, ఉత్సాహవంతుడై, చైతన్యశీలియై ఉండాలి. దేశం లేదా సంస్థ అభ్యుదయం అంటే ప్రజల/ ఉద్యోగుల సమగ్ర వికాసం. ఆర్థికంగా, సంస్కృతి పరంగా, విలువల ఆధారంగా ఎదుగుతూ, దర్శించిన సుదూర లక్ష్యాలను ఛేదించడమేకాక ఆ ఫలితాలను అర్హత ప్రాతి పదికగా అందరికీ అందేట్లుగా బాధ్యతాయుతంగా నడిపించడమే అతని ముందున్న కర్తవ్యం. తాను విలువల ఆధారంగా జీవిస్తూ అనుచరులను ఆ మార్గంలో నడపడం నాయకుని సమర్థతకు గీటురాయి.

ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం.. ఈ ఆరు ఉన్నచోట విజయం ఉంటుంది. ఈ లక్షణాలే నాయకుని మార్గంలో అపజయాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళేందుకు ఊపిరులూదుతాయి. తనను ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా వాటిని దాటేందుకు అవసరమైన ప్రేరణను ఇస్తాయి. సింహం నాయకుడై ఉద్యమిస్తే కుందేళ్ళ సైన్యమై నా ఉత్సాహంగా ఉద్యమిస్తుంది. విజయాన్ని సాధిస్తుంది. అతనే నిరుత్సాహంతో బద్ధకిస్తే పోటీ దారుల నుండి సంస్థను కాపా డేందుకు అనుయాయులూ శ్రద్ధ చూపరు. అచేతనులు, సోమరులు నాయకులుగా, అనుయాయులుగా ఉన్న సంస్థ అయినా, దేశమైనా శత్రువుల చేతికి చిక్కుతుంది. ఉత్సాహవంతుడైన నాయకుడే ఉత్తమ (గొప్ప) నాయకునిగా గుర్తింపు పొందుతాడు. 

నాయకునిలో ముఖ్యమైన 5 లక్షణాలు ఉండాలి

1. ఇవ్వడం. ‘పొందడంలో ఉన్న రహస్యమే ఇవ్వడం’ అంటారు పెద్దలు. ఎంతగా మనం ఇస్తామో అంతగా తిరిగి ప్రకృతి మరో రూపంలో మనకిస్తుంది.

2. ఇతరులను గౌరవించడం. బలం బలాన్ని గౌరవిస్తుంది. కాబ ట్టి, విజ్ఞానపరంగా, ప్రతిభా పాటవాల పరంగా ఉన్నతుడు కావాలి ఆర్థికంగా బలోపేతుడు కావాలి.

3. ఇతరుల మనోభావాలను అవగాహన చేసుకోగలగాలి. దాని నే ‘పరేంగితజ్ఞత’ అంటారు. ఆవలి వ్యక్తుల ఆంతర్యాన్ని, భావోద్వేగాల ను అవగాహన చేసుకొని స్పందించే వారు ఏనాడూ ఓటమి పాలు కారు.

4. అనుయాయులు సాధించిన విజయాల విలువలను గుర్తించి ఎప్పటికప్పుడు వారిని పదుగురి ముందు సత్కరించడం నేర్చుకోవాలి.

5. కొత్తదనాన్ని ఆవిష్కరించేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చిన ఉద్యోగులకు తగిన ప్రోత్సాహాన్ని అందించాలి. వారి విజయా లను ఉత్సవంగా నిర్వహించాలి. వారిని ఘనంగా సత్కరించాలి. దానివల్ల నాయకుడూ ఉత్సాహం గా ఉంటాడు. అనుయాయులూ ఉత్సాహవంతులవుతారు. సంస్థ ఆర్థికంగా ఎదుగుతుంది.

అంతేకాదు, సామాజిక బాధ్యతగా దేశ పురోగతిలో సదరు సంస్థ తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంది. నాయకుడు, ఉద్యోగులు గుర్తించాల్సిన ముఖ్యమైన అంశం దేశం లేదా సంస్థ ఉంటేనే ప్రజలకు లేదా ఉద్యోగులకు ఉనికి. ప్రజలు లేదా ఉద్యో గుల ప్రగతియే దేశం లేదా సంస్థ ప్రగతి. ‘విశ్రాంతి తీసుకునే వాని బుద్ధి తుప్పు పట్టి పోతుంది’ అన్న వివేకానంద స్వామి మాటలు నిత్య స్మరణీయాలు.