14-08-2024 12:30:00 AM
కోల్‌కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆస్పత్రిలో అయిదు రోజుల క్రితం జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై జాతీయ స్థాయిలో డాక్టర్లు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాధితురాలి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. బుధవారం ఉదయం 10 గంటలలోగా అన్ని దస్త్రాలను సీబీఐకి అందజేయాలని ఆదేశించింది. సెమినార్ హాలులో జూనియర్ డాక్టర్‌పై అత్యంత పాశవిక దాడి జరుగుతుంటే ఆస్పత్రిలో ఉన్నవారికి ఆ విషయం తెలియక పోవడం, యాజమాన్యం ఆలస్యంగా స్పందించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, ఆందోళనకారుల ఒత్తిడితో రాజీనామా చేసిన కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సవదీప్ ఘోష్‌పైనా కోర్టు తీవ్రంగా మండిపడింది. రాజీనామా చేసిన వెంటనే ఆయనకు మరో పదవి ఎలా ఇస్తారని రాష్ట్ర ప్రభుతాన్ని నిలదీసింది. ఆయనను వెంటనే విధుల నుంచి తొలగించి సెలవుపై పంపాల్సిందిగా ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై మృతురాలి తల్లిదం డ్రులు సంతృప్తి వ్యక్తం చేసినా, వైద్య విద్యార్థులు మాత్రం తాము ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. తమ భద్రతకు సంబంధించి ఎలాంటి హామీ లేదని, అందుకే ఆ సమస్య పరిష్కారమయ్యే దాకా ఆందోళన విరమించేది లేదని వారంటున్నారు.
ఈ నెల 8న నైట్‌డ్యూటీలో ఉన్న బాధితురాలు సహచరులతో కలిసి ఒలింపిక్స్ చూసింది. నీరజ్ చోప్రా మ్యాచ్ ముగిసిన తర్వాత తోటి వైద్యులతో కలిసి భోజనం చేసి సెమినార్ హాలులో విశ్రాంతి తీసుకుంటానని చెప్పి వెళ్లింది. అదే ఆమె పాలిట యమపాశమైంది. తెల్లవారు జామున 3 నుంచి 5 గంటలమధ్య కామాంధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదిక తెలిపింది. బాధితురాలి బొడ్డు, పెదవులు, వేళ్లు, ఎడమకాలికి గాయాల గుర్తులున్నాయి. ఆమె కేకలు వేయకుండా నోరు మూసేసి తలను గోడ లేదా, నేలకు బలంగా కొట్టినట్లు గుర్తించారు.
బాధితురాలి నోరు, గొంతును నిరంతరం నొక్కి ఉంచినట్లు, కళ్లు, నోటితోపాటు ఆమె ప్రైవేటు భాగాలనుంచి రక్తస్రావం జరిగిందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంజయ్ రాయ్ అనే పౌర వలంటీర్‌ను అరెస్టు చేశారు. ఆస్పత్రివద్ద ఉండే పోలీసు ఔట్‌పోస్టులో నిందితుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. పోర్న్ వీడియోలకు బానిసైన అతడు హింసాత్మక క్లిప్‌లు చూడడానికి ఇష్టపడతాడని చెప్తున్నారు. నాలుగు పెళ్లిళ్ల్లయినట్లు, వేధింపులు భరించలేక వారంతా దూరమైనట్లు దర్యాప్తులో తేలింది.
ఇక నేరం చేసిన తర్వాత తాపీగా తన బ్యారక్‌కు వెళ్లిన సంజయ్ చాలా గంటలసేపు నిద్రపోయినట్లు తేలింది. నిద్ర లేచిన తర్వాత తన నేరాన్ని కప్పి పుచ్చుకోవడానికి బట్టలు ఉతికేసి, షూపై రక్తపు మరకలను చెరిపేసినట్లు వెల్లడయింది. ఘటనా స్థలిలో బ్లూటూత్ హెడ్‌సెట్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సంజయ్ శరీరం మీది రక్కిన గాయాలు, బాధితురాలి గోళ్లు, రక్త నమూనాలో సరిపోలినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఘటనపై నిందితుడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనపడలేదని, కావాలంటే ఉరి తీసుకోవచ్చని విచారణ సందర్భంగా చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన వెనుక ఒకరికంటే ఎక్కువమంది ప్రమేయం ఉండి ఉండవచ్చన్న అనుమానాలున్నాయి. మరోవైపు వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. వైద్యులకు రక్షణగా కేంద్రం చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైద్యుల సమ్మెతో ప్రధాన నగరాల్లోని అనేక ఆస్పత్రుల్లో వైద్యసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఔట్ పేషెంట్ విభాగాల్లో రోగులు బారులు తీరుతున్నారు. సత్వర విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించినప్పుడే బాధితురాలికి న్యాయం చేసినట్లవుతుంది.