6 July, 2026 | 3:12 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

ఓ వైపు కాళేశ్వరం.. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ బీఆర్‌ఎస్ నేతల ఉక్కిరిబిక్కిరి

26-06-2025 12:05 AM
  1. విచారణల్లో అగ్రనేతలు, కేసుల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు
  2. వీటికితోడు అంతర్గత సమస్యలు..
  3. త్వరలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల సవాళ్లు

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ అగ్రనేతలు, నాయకులు విచారణలు, కేసులు, అరెస్టులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు బీఆర్‌ఎస్ మాజీ నేతలు కూడా సిట్ ముందు హాజరై తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఫిర్యాదులు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఇటీవల సిట్ ముందు హాజరైన ఈటల రాజేందర్ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారో అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్న ప్రభాకర్‌రావు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయాల్లో తమ ఫోన్లను ట్యాప్ చేశారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి సిట్ విచారణకు రావాలని నోటీసులు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ కారు రేసింగ్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌ను జూలై 1న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 

ఓటమి తెచ్చిన కష్టాలు..

బీఆర్‌ఎస్ హయాంలో అనేక అంశాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ కమిషన్లు వేసింది. బీఆర్‌ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ఈ కష్టాలు వెంటాడుతున్నాయి. అయితే బీఆర్‌ఎస్ గతంలో కూడా అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నది. సీనియర్ నేతలు పార్టీని వదలి వెళ్లిపోవడం, ఎమ్మెల్యేల తిరుగుబాటు వంటి అనేక ఆటుపోట్లను చవిచూసింది.

తొమ్మిదేళ్లు అధికారం అనుభవించిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవడంతో మళ్లీ సంక్షోభాలు మొదలయ్యాయి. ఇందులో అధికార పార్టీ నుంచి కొన్నైతే, మరికొన్ని అంతర్గత సమస్యలే. ఎమ్మెల్సీ కవిత ఉదంతం ఇంకా సమసిపోలేదు. అంతర్గతంగా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇవన్నీ కూడా క్యాడర్‌ను కలవరానికి గురిచేస్తున్నాయి. 

అగ్రనేతల విచారణ..

గులాబీ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారెజ్ పిల్లర్ల కుంగుబాటు అంశంపై ఏర్పాటైన విచారణ కమిషన్ ముందు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కీలకనేత హరీశ్‌రావు హాజరయ్యారు. మేడిగడ్డ బ్యారెజ్ పిల్లర్ల కుంగుబాటుపై ఏర్పాటైన జస్టిస్ పీసీఘోష్ కమిటీ ఇచ్చే నివేదిక ఏఏ అంశాలను ప్రస్తావిస్తుందో అనే ఆసక్తి నెలకొన్నది.

ఫార్ములా ఈ కార్ రేసింగ్‌పై విచారణ చేస్తున్న ఏసీబీ ముందు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండుసార్లు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోసారి విచారణకు పిలుస్తామని ఇప్పటికే ఏసీబీ కేటీఆర్‌కు సూచించింది. దీనితో ఈ కేసు కూడా ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొన్నది. 

ఎదురుకాబోతున్న ఎన్నికల సవాళ్లు..

అంతర్గతంగా, బహిర్గతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌కు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, తమ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సవాల్‌గా మారే అవకాశాలున్నాయి. ఆర్నెళ్ల వ్యవధిలో జూబ్లీహిల్స్‌కు బైపోల్ ఉండబోతోంది. గతంలో గ్రేటర్‌లో హవా చాటిన కారు పార్టీ అదే స్పీడ్‌ను కొనసాగిస్తుందా చూడాలి. ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాల్సిన అనివార్యత నెలకొన్నది.

ఈ గెలుపుతో పార్టీ క్యాడర్‌లో జోష్ తీసుకురావాల్సిన అవసరముందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మునపటి పట్టును నిలబెట్టుకునేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుందంటున్నారు. రాజకీయ వ్యూహాల్లో తలపండిన నేతగా పేరున్న కేసీఆర్ ప్రస్తుత సంక్షోభా న్ని ఎలా అధిగమిస్తారు..రాబోయే ఎన్నికల సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు..అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

ఫోన్ ట్యాపింగ్ తీగ ఎవరి మెడకో..

ఫోన్ ట్యాపింగ్‌పై ప్రస్తుతం సిట్ విచారణ చేస్తోంది. ఇప్పటికే అనేకమంది రాజకీయ ప్ర ముఖులు ఈ దర్యాప్తు సంస్థ ముందు హాజరై తమ ఫోన్లు ట్యాప్ చేశారంటూ ఆరోపిస్తున్నా రు. అగ్రనేతలు విచారణ కమిషన్ల ముందు హాజరవుతుంటే నేతలపై కేసులు నమోదు కావ డం, అరెస్టుల వంటి అంశాలు కూడా గులాబీ నేతలకు సమస్యలు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా ఓ క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలతో ఎమ్మెల్యే పాడి కౌశి క్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ సోషల్ మీడియా నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తు న్న ఒకరిద్దరు నేతలపై పోలీసులకు ఫిర్యాదులు రావడంతో పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తూ కేటీఆర్‌పైనే 14 కేసులున్నట్లు ఆయనే ఇటీవల మీడియాతో చెప్పారు.