calender_icon.png 7 July, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెరుచుకున్న అంగన్వాడీలు

12-06-2025 01:45:20 AM

- మొదటి రోజు భోజనంలో ‘ఎగ్ బిర్యానీ’

హైదరాబాద్, జూన్ 11 (విజయ క్రాంతి): వేసవి సెలవుల ముగియడంతో బుధవారం రాష్ర్టవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు తిరిగి తెరుచుకున్నాయి. ‘అమ్మ మాటp అంగన్వాడీ బాట’ బ్యానర్లతో ర్యాలీలు నిర్వహించి అంగన్వాడి కేంద్రాల వద్ద చిన్నారులకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు స్వాగతం పలికారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మొదటి రోజు ప్రత్యేకంగా ‘ఎగ్ బిర్యానీ’ని మధ్యాహ్న భోజనంలో వడ్డించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా అంగన్వాడీ కేంద్రాల్లో వెరైటీ ఫుడ్‌గా ఎగ్ బిర్యానీ వడ్డించడం గమనార్హం. ప్రతి రోజు ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీలైన చోట్ల చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటోంది.

ఈ తరహా పోషకాహారం అందించడం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో అడ్మిషన్లు, హాజరు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. టేస్ట్, న్యూట్రిషన్ రెండింటినీ సమపాళ్లలో అందిస్తూ అంగన్వాడీలపై పిల్లలు, తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతుందన్న విశ్వాసంతో ప్రభుత్వం ఉంది. రాష్ర్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు పదుల సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు.

ప్రభుత్వం అంగన్వాడీల బలోపేతం కోసం తీసుకుంటున్న చర్యలను స్వయంగా పరిశీలించిన కమిషన్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌లో గల సింగరేణి కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో వడ్డించిన ఎగ్ బిర్యానినీ చిన్నారులు ఎంజాయ్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో కనీసం కోడిగుడ్లను కూడా ఇవ్వట్లేదు.. అటువంటిది తెలంగాణ అంగన్వాడీ కేంద్రాల్లో ఏకంగా ఎగ్ బిర్యానీ వడ్డించడం విశేషం.