31-01-2026 07:55:17 PM
జిల్లాలో 51 మంది బాలకార్మికులకు విముక్తి
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నితిక పంత్
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్–XII కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 51 మంది బాలకార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. జనవరి 1 నుంచి 31 వరకు ప్రత్యేక బృందాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 46 మంది బాలురు, 5 మంది బాలికలు ఉన్నారని చెప్పారు. ఆసిఫాబాద్ సబ్‌డివిజన్‌లో 23 మంది (22 బాలురు, 1 బాలిక), కాగజ్‌నగర్ సబ్‌డివిజన్‌లో 28 మంది (24 బాలురు, 4 బాలికలు) బాలకార్మికులను గుర్తించినట్లు వివరించారు.
ప్రమాదకర పనుల్లో పిల్లలను నియమించిన యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 14 ఏళ్ల లోపు పిల్లలను ఎలాంటి పనుల్లోనూ పెట్టరాదని, 15 నుంచి 18 ఏళ్ల వయసు గల వారిని ప్రమాదకర పనుల్లో పెట్టడం నేరమని స్పష్టం చేశారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ సహకరించాలని, ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచించారు.