19-08-2025 04:46:13 PM
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లోని కోటా-బుందీలో రూ.1,507 కోట్ల అంచనా వ్యయంతో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. క్యాబినెట్ సమావేశం తర్వాత మీడియాకు వివరణ ఇస్తూ సమాచార & ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్(Minister Ashwini Vaishnav) గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) నిధులు సమకూరుస్తుందని చెప్పారు. విమానాశ్రయం కోసం, రాజస్థాన్ ప్రభుత్వం 1,089 ఎకరాల భూమిని ఉచితంగా అందిస్తుందని.. విమానాశ్రయం సంవత్సరానికి 2 మిలియన్ల మంది ప్రయాణీకులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని మంత్రి తెలిపారు.
విమానాశ్రయం ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని.. స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుందని మంత్రి వైష్ణవ్ అన్నారు. ఎఎఐ(AAI) దాని అంతర్గత నిధుల ద్వారా ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తుందని.. 24 నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందని భావిస్తున్నారు. గత 11 సంవత్సరాలలో, దేశంలో కార్యాచరణలో ఉన్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 నుండి 2025 నాటికి రెట్టింపు కంటే ఎక్కువగా 162కి పెరిగిందని ఆయన అన్నారు. అలాగే, 2014లో 16.8 కోట్ల మంది విమాన ప్రయాణికుల సంఖ్య ఈ సంవత్సరం 41.2 కోట్లకు పెరిగిందని ఆయన తెలిపారు.