16-07-2025 12:00:00 AM
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): బీసీల రిజర్వేషన్ల విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా రాజ్‌భవన్‌కు చేరింది. పంచాయతీరాజ్ చట్టంలో సవరణల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గవర్నర్‌కు పంపింది.
పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 క్లాజ్ (ఎ) సవరించాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఆ సెక్షన్‌లో స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయని ఉంది. అందుకు 50 శాతానికి మించకుండా అనే వాక్యా న్ని తొలగిస్తూ సవరించాలని నిర్ణయించారు.
పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు ఇచ్చిన గడవు సమీపిస్తున్నందున.. ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది, పంచాయతీరాజ్ శాఖ ఈ ఫైలును న్యాయశాఖ ఆమోదించిన తర్వాత మంత్రి, సీఎం ఆమోదంతో రాజ్‌భవన్‌కు ముసాయిదాగా పంపిం చింది. గవర్నర్ ఆమోదం పొందితే చట్టసవరణ అమల్లోకి రానుంది.
దీనికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను సిఫార్స్ చేయనుంది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించనుంది. పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టుకు గడువు విధించిన విష యం తెలిసిందే.
హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండటంతో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.