15-07-2025 11:50:57 PM
చిన్నచింతకుంట: సకల లోకాలను ఏలే శక్తి మాత పోచమ్మ తల్లి బోనాల పండుగ ఉత్సవాలను పల్లెజనులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆషాఢ మాసం మంగళవారం పల్లెల్లో బోనాల సందడి మొదలైంది. గ్రామల్లో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. మండలంలోని చిన్న చింతకుంట, లాల్ కోట, మద్దూర్, ఉంద్యాల గ్రామాలలో మంగళవారం గ్రామ దేవత పోచమ్మ బోనాల పండుగ ఉత్సవాలను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి కొత్త మట్టి కుండకు పసుపు, కుంకుమతో అలంకరించి వేప కొమ్మలను ఉంచి అమ్మవారి బోనాన్ని మహిళా భక్తులు తలపై ఉంచుకొని.
డప్పుచప్పుళ్ల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయాలకు చేరుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు . లాల్ కోట లో బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా పోతురాజుల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అమ్మవారిని సల్లంగా చూడు తల్లి అని వేడుకున్నట్లు భక్తులు తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా ఆయా గ్రామాలలో పండుగ వాతావరణం కనిపించింది.