calender_icon.png 17 July, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బధిర విద్యార్థులకు వృత్తి నైపుణ్య తరగతులు

16-07-2025 12:00:00 AM

- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, జూలై 15 (విజయ క్రాంతి): బధిర విద్యార్థులకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇప్పిస్తూ భవిష్యత్తులో వారు విభిన్న రంగాల్లో రాణించేలా చూస్తామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శాతవాహన యూనివర్సిటీ సమీపంలో గల ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలను మంగళవారం సందర్శించారు. ఇక్కడ బధిర విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బధిర విద్యార్థులు సైతం విభిన్న రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో కుట్టు మిషన్, కంప్యూటర్ రంగంలో శిక్షణ ఇస్తున్నామని అన్నారు.

ఇందుకోసం ప్రస్తుతం ముగ్గురు ఒకేషనల్ టీచర్లను కేటాయించామని తెలిపారు. విద్యార్థులతో ముందుగా పిల్లో కవర్, బ్యాగ్ వంటి సులువైన వస్తువులను కుట్టించడం నేర్పించాలని అన్నారు. ఈ రకమైన శిక్షణల వల్ల వారు భవిష్యత్తులో విభిన్న రంగాల్లో స్థిరపడతారని, మార్కెటింగ్ పై కూడా అవగాహన వస్తుందని తెలిపారు. అనంతరం విద్యార్థుల తరగతి గదులను సందర్శించి వారి నోట్ పుస్తకాలను, చేతి రాతను పరిశీలించారు.

తరగతి గదులు, పాఠశాల ఆవరణలో మంచి పెయింటింగ్స్ వేయించాలని సూచించారు. ఇక్కడి సైన్స్ ప్రయోగశాలను ఆధునికంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఒకేషనల్ కోర్సుల కోసం అవసరమైన వస్తువులు సమకూరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలికల అభివృద్ధి అధికారిని కృపారాణి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ కమల, తదితరులు పాల్గొన్నారు.