calender_icon.png 22 October, 2025 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

300కు పైగా నామినేషన్లు

22-10-2025 01:40:55 AM

-జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల హోరు 

-అర్ధరాత్రి వరకు కొనసాగిన స్వీకరణ  

-ట్రిపుల్ ఆర్ బాధితులు, నిరుద్యోగుల నుంచి భారీగా దాఖలు 

-చివరి సెట్ వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు 

హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 21 (విజయక్రాంతి):జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరి ఊహించని రీతిలో రికార్డు సృష్టిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగియగా, నియోజకవర్గ చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా 300కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు అభ్యర్థులు భారీగా పోటెత్తడంతో షేక్‌పేట ఎమ్మార్వో కార్యాలయం కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకే గడువు ముగిసినా, క్యూలైన్లల్లో ఉన్నవారందరికీ టోకెన్లు ఇచ్చి అర్ధరాత్రి వరకు నామినేషన్లను స్వీకరించారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు రీజనల్ రింగ్ రోడ్,ట్రిపుల్ ఆర్ బాధితులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినే షన్ల ప్రక్రియలో చివరి రోజైన మంగళవారం నాడు తీవ్రమైన హడావిడి నెలకొంది. ఉద యం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు సమయం ఉన్నప్పటికీ, వందలాది మంది అభ్యర్థులు తరలివచ్చారు. దీంతో రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద భారీ క్యూలైన్లు ఏర్పడ్డాయి. ఒక్క చివరి రోజే దాదాపు 189 నామినేషన్లు దాఖలవడం గమనార్హం.

అంతకుముందు వరకు 94 మంది అభ్యర్థుల నుంచి 127 నామినేషన్లు దాఖలయ్యాయి.ఈసారి నామినేషన్లలో నిరసన గళం బలంగా వినిపించింది. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ట్రిపుల్ ఆర్ బాధితులు, ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగ యువకులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఎన్నికల ప్రక్రియ ద్వారా డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో వారు బరిలోకి దిగారు.

ఇది ఉప ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.చివరి రోజున ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ల చివరి సెట్లను దాఖలు చేశారు.కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మూడో సెట్, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నాలుగో సెట్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి రెండో సెట్ నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.