calender_icon.png 12 November, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనరల్ ఆసుపత్రికి 7 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

12-11-2025 10:21:35 PM

నాగర్‌ కర్నూల్‌ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి అత్యవసర వైద్య సేవల కోసం ఉపయోగించే ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలను హైదరాబాద్ టైటాన్స్ రౌండ్ టేబుల్ ఇండియా 303 క్లబ్, ప్రాంక్లిన్ టెంపుల్టన్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సహకారంతో బహూకరించారు. సుమారు ₹7 లక్షల విలువగల 7 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు బుధవారం ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి. ఉషారాణికి అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఉషారాణి మాట్లాడుతూ ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలు ఊపిరితిత్తుల వ్యాధులు, ఛాతి సంబంధిత సమస్యలు, అత్యవసర పరిస్థితుల్లో ఐసీయూ, అక్యూట్ మెడికల్ కేర్, క్యాజువాలిటీ వార్డుల్లో రోగుల ప్రాణరక్షణకు కీలకంగా ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యం ఆక్సిజన్ వినియోగం అధికంగా ఉంటుందని, ఇలాంటి దాతృత్వ కార్యక్రమాలు ప్రజలకు మేలు చేస్తాయని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఆసుపత్రికి అవసరమైన పరికరాల కోసం స్థానిక దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్, ఆసుపత్రి పరిపాలన విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్, వైద్య సిబ్బంది, క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.