calender_icon.png 20 November, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో టెస్టుకు పేస్, బౌన్సీ పిచ్

20-11-2025 12:20:26 AM

  1. ఈడెన్ దెబ్బకు గంభీర్ యూటర్న్
  2. స్పిన్ పిచ్‌లకై చూడడం లేదన్న కోచ్

గుహావటి, నవంబర్ 19 : భారత జట్టు సొంతగడ్డపై ఆడుతున్న ప్రతీసారీ పిచ్‌లపైనే ఎక్కువ చర్చ జరుగుతుంటుంది. గతంలో స్పిన్ పిచ్‌లతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టి విజయాలు సాధించినప్పుడు పిచ్‌లపైనే చర్చ.. ఇప్పుడు స్వదేశంలో స్పిన్ పిచ్‌ల కారణంగానే ఓటములు ఎదురవుతుండడం తో మళ్లీ అదే చర్చ.. సౌతాఫ్రికా చేతిలో తొలి టెస్ట్ ఓటమి నుంచి టీమిండియా బయటపడుతున్నా క్రికెట్ వర్గాల్లో మాత్రం చర్చ జరు గుతూనే ఉంది.

అక్కడి ఓటమితో ఇప్పుడు అందరి చూపు రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న గుహావటి పిచ్‌పై పడింది. శనివారం నుంచి జరిగే రెండో టెస్టు కోసం ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో గడుపుతున్నాయి. అయితే గుహావటి పిచ్ ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈడెన్ ఇచ్చిన షాక్‌తో రెండో టెస్టులో పిచ్‌కు సంబంధించి కోచ్ గంభీర్ యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

గుహావటిలో పేస్, బౌన్సీ పిచ్‌ను రెడీ చేయిస్తు న్నాడు. అందుకే నల్ల మట్టి కాకుండా ఎర్రమట్టితో పిచ్ సిద్ధమవుతోంది. ఎర్రమట్టి పిచ్ లు సహజంగానే పేసర్లకు అనుకూలంగా ఉంటాయి. వేగంతో పాటు బౌన్స్ కూడా ఉంటుంది. దీంతో ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో టీమిండియా కోరినట్టు కాస్త టర్న్ కూడా ఉంటుందని పిచ్ క్యూరేటర్ చెబుతున్నాడు.

కాకుంటే ఈడెన్ పిచ్ తరహాలో కాకుండా మూడోరోజు తర్వాత నుం చి స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. కాగా బౌన్స్ మరీ ఎక్కువ కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారత్ ఓటమిని పక్కనపెడితే ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. బ్యాట ర్లు పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. అనూహ్యంగా టర్న్ అవ్వడంతో ఏ ఇన్నింగ్స్‌లోనూ స్కోర్లు 200 కూడా దాటలేదు.

భారత్ అయితే 124 పరుగుల టార్గె ట్‌ను కూడా ఛేదించలేక చేతులెత్తేసింది. అలాగే  టెస్ట్ మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగిసిపోతే ఆ ఫార్మాట్ ఇంకేం బతుకుతుందంటూ పలువురు మాజీ క్రికెటర్లు మండిప డ్డారు. మ్యాచ్ ఎవరు గెలిచినా కనీసం నాలు గు లేదా ఐదో రోజుల్లో ఫలితం తేలేలా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో గుహావటి పిచ్‌పై మరింత జాగ్రత్త తీసుకుంటున్నారు.

ఈ పిచ్ గురించి గంభీర్ కూడా స్పందించాడు. తానెప్పుడూ మొదటిరోజు నుంచే స్పిన్‌కు అనుకూలించేలా పిచ్ ఇవ్వమని కోరలేదని స్పష్టం చేశాడు. మరీ స్పిన్ పిచ్‌ల కోసం తాను చూడడం లేదన్న గంభీ ర్ తొలి టెస్టులో గెలిచి ఉంటే ఇంత చర్చ జరిగేది కాదన్నాడు. రెండో టెస్టుకు ముందు పిచ్ గురించి తనను ప్రశ్నలు అడిగి ఉండేవారు కాదంటూ వ్యాఖ్యానించాడు. ఏ మ్యా చ్‌లోనైనా పిచ్‌లు రెండు జట్లకు సమానంగా ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే రెండో టెస్ట్ భారత జట్టుకు డూ ఆర్ డై లాంటిదే. ఎందుకంటే సిరీస్‌లో 0 వెనుకబడిన టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సమం చేయగలుగుతుంది. మరోవైపు 2 సిరీస్‌ను సాధించడం లేదా మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా సిరీస్ సౌతాఫ్రికా సొంతం చేసుకుంటుంది. అందుకే ఒత్తిడం తా భారత్‌పైనే ఉంది. అటు పేస్, బౌన్సీ పిచ్ రెడీ అవుతుందన్న వార్తలతో సౌతాఫ్రికా కూడా రబాడకు బ్యాకప్‌కు ఎంగిడిని జట్టులోకి తీసుకుంది. కెప్టెన్ శభ మన్ గిల్ రెండో టెస్టులో ఆడడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్న గిల్ జట్టుతో పాటే గుహావటికి వచ్చాడు. గిల్ ఆడేది లేనిది మ్యాచ్‌కు ముందురోజు నిర్ణయిస్తామని బీసీసీఐ ప్రకటించింది. ఇక తుదిజట్టులో గిల్‌ను నితీశ్ రెడ్డి రీప్లేస్ చేసే అవకాశముండగా... నాలుగో స్థానంలో జురెల్‌ను ఆడిస్తారని భావిస్తున్నారు. మూడో ప్లే స్ కోసం సాయి సుదర్శన్‌ను జట్టులోకి తీసుకోవచ్చు.