20-11-2025 12:33:43 AM
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి) : స్వాతంత్య్ర సాధన ఉద్యమ పార్టీగా, స్వతంత్ర భారతదేశా న్ని అత్యంత ఎక్కువకాలం పాలించిన పార్టీగా కాంగ్రెస్‌కు పేరుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాజకీయంగా అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. అటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ, ఇటు ఆయా రాష్ట్రాల్లోనూ సొంతంగా పోటీచేసినా, అవసరాన్ని బట్టి ఇతర పార్టీలతో కూటమిగా ఏర్పడి పోటీచేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది.
కొంతకాలంగా ఆయా ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఓడిపోవడంపై ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ ఆసక్తికరమైన ఆరోపణలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కేంద్రంలోని బీజేపీ, కేంద్ర ఎన్నికల కుమ్మక్కు అయి ఓట్ చోరీకి పాల్పడుతుందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని పలు సమావేశాలు నిర్వహించి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
అయితే బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూట మి ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకున్నది. కానీ బీహార్‌లో కూడా ఓట్ చోరీ జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనికి ప్రధాన కారణం బీహార్ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(ఎస్‌ఐఆర్) పేరిట రాష్ట్రంలోని 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించింది. అయితే ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దఎత్తున పోరాటం చేశారు. కానీ ఫలితాల్లో ఇది ఎలాంటి ప్రభావమూ చూపలేదు.
దీనికి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంస్థాగత లోపమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఆయా అంశాలకు సంబంధించిన ఆరోపణలకు మాత్రమే పరిమితమవుతుందని, వాటిని నిరూపించే ప్రయత్నం, వాస్తవాలను బహిర్గతం చేసే ప్రయత్నం గానీ చేయడం లేదని స్పష్టం చేస్తున్నారు. రాజకీయంగా సానుకూలంగా మార్చుకోగలిగే పరిణామాల ను కూడా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతుంది.
ఇలాంటి పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ దేశవ్యాప్తంగా రాజకీయ పట్టును కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు. దీనికి బీహార్ ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనమని ఉదాహరిస్తున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ నాయకులతో ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించారు.
తొలగించిన వివరాలు బహిర్గతం చేసినా..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముసాయిదా ఓటరు జాబితాల నుంచి 65 లక్షల మందిని తొలగించడంతో అభ్యంతరం తెలుపుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఓటర్ల జాబితాలో ఏర్పడిన సందిగ్ధతపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను తమకు అందించాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆ ఓటర్లను ఏ ప్రాతిపదికన తొలగించారో తాము కూడా తెలుసుకుంటామని స్పష్టంచేసింది. అదేవిధంగా తొలగించిన ఓటర్ల వివరాలతో కూడిన కాపీని ఏడీఆర్‌కు కూడా అందించాలని స్పష్టం చేసింది. బీహార్‌లో ఎస్‌ఐఆర్ కోసం ఈసీ జారీచేసిన ఆదేశాలను ఏడీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతోపాటు తాజాగా తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల పేర్లు, వివరాలను బహిరంగంగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేసింది.
జాబితాల నుంచి తీసేసిన ఓటర్లు మృతిచెందారా?. శాశ్వతంగా వలసపో యారా?. అనే విషయాలను స్పష్టం చేయాలని కోరింది. ఆ సంస్థ ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం తొలగించిన ఓటర్ల వివరాలు, తొలగి ంపునకు గల కారణాలను వెల్లడించింది.
కానీ లాభమేంటి..?
బీహార్ ఓటర్ల జాబితా నుంచి కేంద్ర ఎన్నికల సంఘం 65 లక్షల మందిని తొలగించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా సంబంధిత ఫారాలను సమర్పిం చడా నికి గడువుకు ఒక రోజు ముందే వారందరినీ ఓటర్ల జాబి తా నుంచి తొలగించనున్నట్టు తెలిపింది. లిస్టు నుంచి తీసేసే ఓటర్లలో 21.6 లక్షల మంది మరణించారని, 31.5 లక్షల మంది శాశ్వతంగా బీహార్ వదిలి వెళ్లారని, 7 లక్షల మంది రెండు ప్రదేశాలలో ఓటర్లుగా నమో దు చేసుకున్నారని, లక్ష మంది ఆచూకీ తెలియడం లేదని ఈసీ పేర్కొంది.
భారీగా ఓటర్లను తొలగిస్తే బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాల్లో సగటున ఒక్కో నియోజకవర్గానికి 25 వేలకు పైగా పేర్లు డిలీట్ అయ్యాయి. అయితే ఈ పరిణామం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభా వాన్ని చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో అనేక స్థానాల్లో పలువురు అభ్యర్థులు స్వల్ప తేడాతో విజయం సాధించారని గణాంకాలు చెబుతున్నాయి. దీంతోపాటు ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆయా నియోజకవర్గాల్లో తొలగించిన ఓట్ల కంటే తక్కువ తేడాతో కూడా ఓడిపోయారు.
అయితే ఈసీ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీలు వ్యతిరేకించాయి. దీనిని తొందర పాటు చర్యగా అభివర్ణిస్తూ నిరసనలు కూడా తెలుపుతున్నాయి. అయితే ఓటర్ జాబితా నుంచి 65 లక్షల మందిని తొలగించిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరోపణలకు, నిరసనలకు మాత్రమే పరిమితమైంది. జాబితా సరి చేయడంలో తమ వంతు బాధ్యతను విస్మరించింది. ఫలితంగా ఎన్నికల ఫలితాల్లో ఘోరంగా భంగపాటుకు గురైంది.
వాస్తవానికి ఎస్‌ఐఆర్ పేరుతో ఓటర్లను తొలగించినప్పటికీ అభ్యంతరం ఉన్న వారు సరైన పత్రాలు చూపించి తిరిగి నమో దు చేసుకోవచ్చు. జాబితాలో తిరిగి నమోదు చేయించుకునేందుకు నెల రోజుల గడువు ఇచ్చినా దీనిని కాంగ్రెస్ వినియోగించుకోలేదని వాదనలు వినిపిస్తున్నాయి.
స్వయంకృతమే కారణం...
బీహార్‌లో కాంగ్రెస్ కూటమి ఓడిపోవడానికి స్వయం కృతమే కారణమని స్పష్టంగా తెలుస్తుంది. మొదటి నుంచి ఆ పార్టీ ఈవీఎం, ఓట్ల చోరీ అంశాలను మాత్రమే ప్రధానంగా ఎత్తి చూపుతున్నది. బీహార్‌లో కాంగ్రెస్ కూటమి ఓటమికి వారు చేసిన రాజకీయాలే కారణం. నితీష్ కుమార్‌పై ఉన్న అధికార వ్యతిరేకతను ఓట్లుగా మలచుకుని యువతకు అద్భుతమైన భవిష్యత్ ఇస్తామని నమ్మ కం కల్పించాల్సింది పోయి, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ఓటర్ అధికార యాత్ర చేశారు. ప్రజా సమస్యలను కా కుండా, ఎన్నికల వ్యవస్థపై అనుమానం వ్యక్తం చేసేలా ప్రచారం చేశారు. ఓట్ చోరీ అంశంపై దృష్టి సారించడమే బీహార్‌లో కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణమైంది.
అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఎంఐఎం..
బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తమ సత్తా చాటుకున్నది. ఓట్ల తొలగింపు అంశాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్నది. అవకాశాన్ని అందిపుచ్చుకొని 2020 ఎన్నికల్లో తరహాలోనే ఐదు స్థానాలను కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ కూటమి ఘోరంగా విఫలమైనప్పటికీ ఎంఐఎం పార్టీ తన పట్టు నిలుపుకుంది. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలోని ఐదు స్థానాల్లో గెలుపొందింది.
జోకిహత్ (అరారియా), కోచాధామన్ (కిషన్‌గంజ్), అమౌర్ (పూర్ణియా), బైసి (పూర్ణియా), బహదూర్ గంజ్ స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందారు. వీటిలో నాలుగు స్థానాలను 2020 ఎన్నికల్లో కూడా ఆ పార్టీ గెలుచుకోవడం గమనార్హం. ఇండియా కూటమిలో చోటు దక్కకపోవడంతో, రాష్ర్టంలో తమ ఉనికిని చాటుకోవాలని ఎంఐఎం గట్టిగా ప్రయత్నించింది. ఈ క్రమంలో ఓట్ల తొలగింపు అంశాన్ని పూర్తిస్థాయిలో వాడుకున్నది. తొలగించిన ఓటర్లను గుర్తించి వారిని తిరిగి జాబితాలో చేర్చేందుకు కృషి చేసింది.
తొలగింపునకు గురైన వారు బీహార్ ఓటర్లే అనేందుకు కావాల్సిన ఆధారాలను సేకరించి మళ్లీ ఓటు హక్కు కల్పించేలా సహకరించింది. కాంగ్రెస్ కూటమి కేవలం ఆరోపణలకే పరిమితమైన నేపథ్యంలో ఎంఐఎం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి బీహార్‌లో తమ స్థానాలను పదిలం చేసుకుంది. కానీ కాంగ్రెస్ మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం, కేవలం ఎన్నికల సంఘంపై ఆరోపణలకు పరిమితమైన తీరుతో మరింత దిగజారిపోయింది.
ఇంట్లో కూర్చొంటే కాదు... రోడ్డెక్కి కొట్లాడాలి
* మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్
బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన భారీ ఓటమి తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ఓట్ల తొలగింపు విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ పేరుతో భారీఎత్తున ఓట్లు తొలగించటం ‘ఓట్ల దొంగతనం’ కిందకే వస్తుందని వ్యాఖ్యానిస్తూ కాంగ్రెస్ పార్టీలోని లోపాలను కూడా ఎత్తి చూపారు. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 19 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఈసారి కేవలం 6 సీట్లు మాత్రమే దక్కించుకోవడంపై స్పందించారు.
కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూసిన నేపథ్యంలో పార్టీ తన సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఓట్ల తొలగింపుపై చేసిన కాంగ్రెస్ కూటమి చేసిన ఆరోపణలపై గదుల్లో కూర్చొని మీటింగ్‌లే కాకుండా రోడ్డెక్కి స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ పనిలో బీఎల్‌వోలతో కలిసి పనిచేయాలని సూచించారు. సంస్థాగత బలోపేతంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.