calender_icon.png 17 December, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ

17-12-2025 06:13:58 PM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ మండలం సాలెగూడ గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించి స్టేజ్ ఆర్. ఓ. లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలో రద్దీ లేకుండా చూడాలని, ఓటర్లను వరుస క్రమంలో కేంద్రంలోనికి అనుమతించాలని, మధ్యాహ్నం 1 గంట లోపు వరుసలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతించాలని తెలిపారు.

పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలని, మధ్యాహ్నం 2 గంటల నుండి వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు వెల్లడించాలని తెలిపారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాల వెల్లడి తరువాత ఉప సర్పంచ్ ను ఎన్నుకోవాలని, ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా తగు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా 3వ విడత ఎన్నికలు జరుగుతున్న ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్ నగర్ మండలాల పోలింగ్ సరళిని ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. పోలింగ్ అధికారులకు సూచనలు జారీ చేస్తూ పోలింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, ఉప సర్పంచ్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని తెలిపారు. 3వ విడతలో 104 గ్రామపంచాయతీ సర్పంచ్, 744 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.